సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు తాలూకా పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై దాడి కేసులో పలువురు రాజకీయ ప్రముఖులు రంగప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడు బోడెపూడి రాంబాబుకు మద్దతుగా ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు పోలీసు శాఖలోని కొందరు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడమే కాకుండా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే చర్యలు తీసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో నిందితులను పట్టుకొని కేసులు పెడుతున్న పోలీసులు.. ఏకంగా ఓ పోలీసునే నడిరోడ్డుపై కొట్టిన కేసులో ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని కేసులు పెట్టి ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి విచారణ పేరుతో వేధిస్తున్న పోలీసులు సొంత శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడి విషయంలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీనివాసరావును అకారణంగా కొట్టడమే కాకుండా చేయి కొరికి, కారును పైకి దూకించి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి పట్ల మెతకవైఖరి అవలంబించడం సరైన నిర్ణయం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితుడు గతంలో కూడా పలువురిపై ఇలాగే దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని తెలుస్తోంది. దుందుడుకు స్వభావం కలిగిన నిందితుడిపై తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment