చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి
ఒంగోలు అర్బన్: పని ప్రదేశాల్లో జరిగే లైంగిక వేధింపుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని చట్టాలపై అవగాహన పెంచుకుని చైతన్యవంతులుగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలోని పని ప్రదేశంలో శనివారం మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013పై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. దీనిలో పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లైంగిక వేధింపులను అరికట్టేందుకు సంబంధిత చట్టాలను పక్కాగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని ప్రదేశాల్లో జరిగే మహిళా లైంగిక వేధింపులపై చట్టాలను పక్కాగా అమలు చేస్తూ అరికట్టాలన్నారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు 41 కేసులు నమోదైనట్లు తెలిపారు. చట్టంపై అవగాహన లేకపోవడం, ఒకవేళ అవగాహన ఉన్నా ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోవడం వంటి కారణాలతో తక్కువ కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఇంటి నిర్వహణతోపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే మహిళలు మంచి, సురక్షిత వాతావరణంలో విధులు నిర్వహించేలా ఈ చట్టం తోడుతుందన్నారు. ఏదైనా పని ప్రదేశంలో మహిళ లైంగిక వేధింపులకు గురైతే ఆ మహిళా ఉద్యోగికి అండగా నిలవాల్సిన బాధ్యత ఇతర మహిళా ఉద్యోగులపై ఉందన్నారు. ఈ చట్టంపై మహిళలు పూర్తి అవగాహన చేసుకుని పనిచేసే ప్రతిచోటా అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీనియర్ సివిల్ జడ్జి జీ దీనా మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ విధులు నిర్వర్తించేందుకు సంతోషకరమైన సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఏర్పాటు నిబంధనల అమలు తదితర వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పొదిలి సీడీపీవో సుధామాధురి వివరించారు. తొలుత లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమల్లో భాగంగా ఏపీజేఏసీ అమరావతి జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన షీ బాక్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు. దీనిలో ఐసీడీఎస్ పీడీ మాధురి, డీఆర్‌డీఏ పీడీ వసుంధర, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
లైంగిక వేధింపుల చట్టం పక్కాగా అమలు చేయాలి కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment