108 ఉద్యోగులను బానిసల్లా చూస్తున్న ప్రభుత్వం
ఒంగోలు టౌన్: ఉద్యోగుల చేత కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ 12 గంటల పాటు పనిచేయించుకుంటున్న అరబిందో యజమాన్యం 108 సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా బానిసలుగా చూస్తోందని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా గాలిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన రాలేదని చెప్పారు. దాంతో అనివార్యంగా ఈ నెల 26 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. యాజమాన్యం 108 ఉద్యోగుల చట్టపరమైన హక్కులను హరించివేసిందన్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలకనుగుణంగా ఇంక్రిమెంట్లు వేయాలని డిమాండ్ చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునే సమయంలో చాలా మంది 108 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ పట్టించుకున్న పాపానపోలేదని, వారి కుటుంబాలను ఆదుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే 108ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. 108 సిబ్బంది చేస్తున్న సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్నీ వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నెల రోజులుగా చేస్తున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం బాధాకరమన్నారు. 26 తేదీ తరువాత జరిగే సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఐటీయూ అనుబంధ సంఘాల తరఫున సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. 108 ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు చెప్పారు.
108 వాహనాలు శిథిలావస్థకు చేరిపోయినా బాధితులకు సేవ చేయడంలో ఉద్యోగులు వెనకాడలేదని తెలిపారు. ఎప్పటికప్పుడు వాహనాలకు మరమ్మతులు చేయించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎల్‌ఐసీ ఎంపాయిస్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షుడు పారా శ్రీనివాసరావు, మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ నాయకులు చిరంజీవి, 108 యూనియన్ నాయకులు సువర్ణ, రేఖ, మున్సిపల్ యూనియన్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment