జెడ్పీ హైస్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్
సంతనూతలపాడు: మండల కేంద్రంలోని ఎస్‌ఎస్ కేసీఎం జెడ్పీ హైస్కూల్ ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు పాఠశాలలో పారిశుధ్యం పైన మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గణితంలో, ఇంగ్లిష్ లో పిల్లల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. బోర్డు పైన హెచ్చవేతలను రాసి పరిష్కరించాలని విద్యార్థులకు చెప్పారు. అనంతరం ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు నిర్మాణం, ఇండోర్ ఆడిటోరియం నిర్వహణ గురించి హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, అపార్ ఐడీ జనరేషన్ పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆన్‌లైన్ విధానంలో ఎదురవుతున్న సమస్యలను ఆమె నిశితంగా పరిశీలించారు. ఆధార్ కార్డు, స్కూల్ రికార్డ్స్, జనన ధ్రువీకరణ పత్రాల్లో ఒకే పుట్టిన తేదీ ఉన్న విద్యార్థుల అపార్ ఐడీ జనరేషన్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి ముందుగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పాఠశాలలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ ను పరిశీలించారు. ఓటరు జాబితాలో కొత్తగా నమోదు, తొలగింపు, అడ్రస్ మార్పు కోసం వస్తున్న దరఖాస్తులు, వాటిని పరిష్కరిస్తున్న తీరును ఆమె బీఎల్వోలని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, ఈఆర్వో వర కుమార్, ఎంపీడీవో సురేష్ బాబు, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎంఈఓ వెంకారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ప్రమోద, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment