గంజాయి విక్రేతలు నలుగురు అరెస్ట్
గిద్దలూరు రూరల్: మండలంలోని మోడంపల్లె గ్రామ సమీపంలో జగనన్న కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. గిద్దలూరు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న పాలూరి మాబుషరీఫ్, పట్టణానికి చెందిన షేక్.మహబూబ్‌బీ, గిద్దలూరు మండలం కె.ఎస్.పల్లె గ్రామానికి చెందిన దాసరి నాని, జయరాంపురం గ్రామానికి చెందిన అవిజ సునిల్ కుమార్ అడ్డదారిలో డబ్బు సంపాదించాలని గంజాయి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన ఆగడాల రామచంద్రుడు వద్ద గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి, ఒక్కో ప్యాకెట్‌ను రూ.1000కు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై నిఘా ఉంచి నలుగురిని అదుపులోకి తీసుకుని 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కె.సురేష్, ఎస్సై ఇమ్మానియేల్, సిబ్బంది పాల్గొన్నారు.
2 కేజీల గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment