ఆరు నెలల్లోనే చంద్రబాబు రంగు బయటపడింది
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య
ఒంగోలు టౌన్: మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచబోమని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మరచిపోయి విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. శుక్రవారం మల్లయ్య లింగం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఆరు నెలల్లోనే చంద్రబాబు రంగు బయటపడిందని వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి గత ప్రభుత్వంపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా అని నిలదీశారు. ట్రూ అప్ చార్జీల పేరుతో మొత్తం రూ.25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడం ఎంత వరకు సబబన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం వాడిన విద్యుత్‌కు ప్రస్తుతం అద్దెకు ఉంటున్న వారు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా పట్టుకున్న బియ్యంపై గగ్గోలు పెడుతున్న పవన్ కళ్యాణ్ అదానీ విషయంలో నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే విద్యుత్ భారాలను భరించాలన్నారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు ఆర్ .వెంకటరావు, కె.వీరారెడ్డి, నల్లూరి మురళి, కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరాం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన గుజ్జుల ఈశ్వరయ్యను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment