అవేం మాటలు!
నారాయణ.. నారాయణ..
మార్కాపురం టౌన్: మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తమను అకారణంగా దూషిస్తున్నాడంటూ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహించారు. మంగళవారం కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాలు.. మార్కాపురం మున్సిపాలిటీలో వార్డు సచివాలయం–9 శానిటేషన్ సెక్రటరీగా శ్రీకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా శనివారం వార్డులోని చెరువు కట్ట వద్ద ఉన్న పేడ దిబ్బలను తొలగించాలని సదరు యజమానులకు సూచిస్తున్నారు. అదే సమయంలో వార్డులోకి వచ్చిన కమిషనర్ శానిటరీ సెక్రటరీని పిలిచి అతనిపై దుర్బాషలాడి దాడికి యత్నించినట్లు ఉద్యోగులు ఆరోపించారు. మానసిక ఆవేదనకు గురైన శ్రీకృష్ణ సోమవారం తన తోటి ఉద్యోగులకు విషయం చెప్పడంతో.. ఎన్‌జీవో నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌తో చర్చించి న్యాయం చేస్తామని చెప్పడంతో వెనుదిరిగారు. మంగవారం ఉదయం సచివాలయ ఉద్యోగులంతా కలిసి శ్రీకృష్ణకు సంఘీభావంగా కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కమిషనర్ తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్‌జీవో నాయకులు శాస్త్రి, శ్రీనివాస్, విజయ తదితరులు కమిషనర్ నారాయణరావును కలిసి మాట్లాడారు. తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన కమిషనర్ మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా దూషించలేదని, విధి నిర్వహణలో భాగంగానే మాట్లాడానని సర్దిచెప్పారు. దీంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.
మార్కాపురం మున్సిపల్ కమిషనర్ వైఖరిపై వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన
Comments
Please login to add a commentAdd a comment