వేతనమివ్వండి మహాప్రభో..
● 6 నెలలుగా జీతం లేదని కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా
● మర్రిపూడి మండలంలో 32 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా
మర్రిపూడి: మండలంలో సీపీడబ్ల్యూ స్కీం పరిధిలో పనిచేస్తున్న 11 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి గత 6 నెలలుగా వేతనం మంజూరు చేయకపోవడంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించడంతో 32 గ్రామాలకు తాగునీటి సరఫరాను నిలిచిపోయింది. వేతనం ఇచ్చే వరకు తాగునీరు వదిలేది లేదని తెగేసి చెప్పారు. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, ప్రస్తుత కాంట్రాక్టర్ తనకు సంబంధం లేదని అంటున్నారని సిబ్బంది వాపోయారు. జీతం ఇవ్వకుంటే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ జ్వాలా నరసింహారావు, ఎంపీడీఓ జగదీష్‌తోపాటు ఆర్‌డబ్ల్యూస్ ఏఈ జైపాల్‌కు వినతి పత్రాలను అందజేశారు. ధర్నాలో కాంట్రాక్ట్ సిబ్బంది పోతులూరయ్య, పి.రోశయ్య, పడిదపు శ్రీను, గౌరవరపు శ్రీను, పి.వెంకటేశ్వర్లు, తిరుమలరావు, టివెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment