నిబద్ధతతో సేవలందించండి
ఒంగోలు టౌన్: చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు ఎక్కువగా నిరుపేద, సామాన్య ప్రజలు వస్తుంటారని, ఈ నేపథ్యంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది క్రమశిక్షణతో నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వివిధ విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలతో సమావేశమయ్యారు. జిల్లా ఆసుపత్రి నిర్వాహణ, అందిస్తున్న సేవలపై సమీక్షించారు. విభాగాల వారీగా ఆసుపత్రి నిర్వాహణకు అవసరమైన బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో మరింత గౌరవం పెంచేలా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, వైద్యాధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెర్ఫార్మెన్స్ ఇండికేటర్‌లో మంచి ప్రతిభ కనబరచాలని చెప్పారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ల్యాబ్ టెస్టులు, ఐపీ సేవల సామార్థ్యాన్ని పెంచాలని చెప్పారు. ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
జీజీహెచ్ వైద్యులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment