ఉత్తుత్తి కారిడార్..!
దొనకొండ: దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలు పత్తా లేకుండా పోయాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాం, అభివృద్ధికి కృషి చేస్తామంటూ 2024 ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టేలా ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలు నీటిలో మూటలుగా మిగిలిపోయాయని ఈ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. 2014 సంవత్సరంలో అసెంబ్లీ వేదికగా దొనకొండను పారిశ్రామికవాడగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దొనకొండ మండలంలో 21 గ్రామాల్లోని 25,886 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ తర్వాత 2016లో విశాఖలో నిర్వహించిన సమావేశంలో విదేశీయులతో ఒప్పంద కార్యక్రమాన్ని నిర్వహించింది. చైనా, ఉక్రెయిన్, స్పెయిన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి హడావుడి చేసింది. కొచ్చర్లకోట, మల్లంపేట, సిద్ధరాయపాలెం, ముంగినపూడి, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, వద్దిపాడు తదితర గ్రామాల్లో సుమారు ఆరు వేల ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేసింది. ఇది ప్రాథమిక సర్వే అంటూ ప్రకటించింది. ఆ తర్వాత అవన్నీ కాకిలెక్కలుగా మిగిలిపోయాయి. రికార్డులు మాత్రం భద్రంగా ఉన్నాయి. పారిశ్రామికవాడకు సంబంధించి అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారే తప్ప ఒరిగిందేమీ లేదు. ఇలా ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వ కాలక్షేపం చేసింది. 2019 ఎన్నికల ముందు ఏపీఐసీసీ ముందు అప్పటి మంత్రులు శిలాఫలకం ఆవిష్కరణ డ్రామా ఆడారు.
విమానాశ్రయం అంటూ హంగామా..
దొనకొండలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి వెయ్యి ఎకరాలు కేటాయిస్తున్నామని ప్రభుత్వ ప్రకటనలు కూడా చేసింది. దీనిపై నివేదికలు సిద్ధం చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆమేరకు వారు ఈ ప్రాంతాల్లో పర్యటించిని నివేదికలు సిద్ధం చేస్తున్నాంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. 2014లోనూ ఇదే తరహాలో హడావుడి చేశారు. కారిడార్‌కు అనుసంధానంగా విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు దొనకొండలోని పాత విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ 15 సీట్ల మినీ విమానాలు రన్‌వేపై దిగడానికి సౌకర్యవంతమని ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారుల బృందం కూడా విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఉన్న 136 ఎకరాలతోపాటు మరో 340 ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. రెవెన్యూ అధికారులు నరసింహనాయునిపాలెం, ఇండ్లచెరువు రెవెన్యూ పరిధిలోని 340 ఎకరాల భూములను అప్పట్లో ఎంపిక చేశారు. మొత్తం 1,575 మీటర్ల పొడవున రన్‌వే ఏర్పాటుకు ప్రాథమిక సర్వే చేపట్టారు. అంతేకాకుండా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సర్వే విభాగం అధికారల బృందం కూడా వారం రోజుల పాటు సర్వే చేసింది. అయితే వారు ఇచ్చిన నివేదికలు ఏమైపోయాయో తెలియదు. తాజాగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్ని రోజులున్నా..మా బతుకులు ఇంతే..
ప్రభుత్వ భూములు మండలంలో అధికంగా ఉన్నా పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్ని రోజులున్నా మా బతుకులు ఇంతే అంటూ ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని పరిశ్రమలతో అభివృద్ధి పరిచి నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామన్న మాట కాకి లెక్కలతో సరి పెడుతున్నారని ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
దొనకొండ పారిశ్రామిక కారిడార్ ప్రకటనలకే పరిమితం 2104 నుంచి చంద్రబాబుపూటకో ప్రకటన 2019 ఎన్నికల ముందు శంకుస్థాపనల డ్రామా తాజాగా విమానాశ్రయం అంటూ హడావుడి వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు అంటూ హంగామా
ముందుకు రాని విదేశీయులు..
దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట, పూటకొక అబద్ధం చెప్తూ వస్తుండడంతో విదేశీయులు ముందుకు రావడంలేదు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, మీ సమస్యలు తీరుస్తాం అంటున్నారే కానీ, ఆచరణ మాత్రం అర కిలోమీటరు దూరంలో ఉందని ఈ ప్రాంత ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన తప్ప, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ప్రజలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment