ఒంగోలు వన్‌టౌన్: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలో రూ.6.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాలికల నూతన వసతి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో మొత్తం రూ.30 కోట్ల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఉన్న బాలుర వసతి గృహాన్ని పాఠశాలకు దగ్గరగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఒంగోలు నగర ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ సంతపేటలో నిర్మించనున్న వసతి గృహంలో 600 మంది విద్యార్థినులకు వసతి కల్పిస్తారన్నారు.కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఏపీడబ్ల్యూఐడీసీ ఈఈ భాస్కర్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment