నేటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ చార్జీల వడ్డన ప్రజలకు భారం కానున్న సొంతింటి కల
ఒంగోలు సబర్బన్:
భూ బాదుడుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థిరాస్థి విలువలు పెంచుకుంటూ పోయింది. అందుకుగాను ఫిబ్రవరి ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి రిజిస్ట్రేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చైర్మన్‌గా స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్, ఆ శాఖ డీఐజీ, సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు కమిటీగా ఏర్పడి భూ బాదుడుకు పూనుకున్నారు. సవరించిన ధరలను ఇప్పటికే కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ల శాఖ ద్వారా జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.300 కోట్లు ఆదాయమే లక్ష్యంగా అధికారులు టార్గెట్లు పెట్టుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా రూ.240 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 5 నుంచి 16 శాతం వరకు పెంచామని అధికారులు చెబుతున్నా ఒక్కో ప్రాంతంలో 30 నుంచి 40 శాతం కూడా పెంచిన ప్రాంతాలు ఉన్నాయి. అధికారులు తక్కువ పెంచిన మార్కెట్ ధరలను మాత్రమే బయట పెడుతూ ఎక్కువగా ఉన్నవాటిని బట్టబయలు చేయకుండా గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అంటే సరాసరిన లెక్కలేస్తే ఒక్క ఏడాదిలో దాదాపు ప్రజలపై రూ.60 కోట్ల వరకు అదనపు భారం పడుతున్నట్లు పెరిగిన మార్కెట్ విలువను బట్టి చూస్తే అర్థమవుతోంది.
కూటమి ప్రభుత్వం
వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ కుదేలు...
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రియల్ ఎస్టేట్ కుదేలైంది. జిల్లాకు ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క కేంద్ర, రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థలు కానీ రాలేదు. దానికి తోడు ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి వరుణుడు ముఖం చాటేశాడు. దాంతో వర్షాలు పడక పంటలు పూర్తిగా లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే కరువు మండలాలను ప్రకటించే స్థితికి చేరుకుంది. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక, మరోపక్క వర్షాలు లేక పంటలు పండక రైతు లోగిళ్లు వెలవెలబోతున్నాయి. దాంతో రైతుల్లో కూడా క్రయ, విక్రయాల సామర్ధ్యం పూర్తిగా క్షీణించి పోయింది. ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. తాజాగా చార్జీలు భారీగా పెరగడంతో ఇబ్బందులు తప్పవని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment