● ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి
ఒంగోలు సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బడ్జెట్‌లోనైనా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ.అశోక్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాగర్ సెంటరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం మరింత ప్రమాదకరమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో తగ్గించి, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తోందన్నారు. యూజీసీ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకువచ్చిన 84,83,85 జీవోలను రద్దు చేయకుండా, విద్యా ప్రైవేటీకరణ ను ప్రోత్సహిస్తోందన్నారు. ఐఫియా కౌన్సిల్ పీవీ సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలన్నింటిలో మాతృభాష మాద్యమాన్ని అమలు చేయాలని, నిర్భంద ఉచిత విద్యాహక్కును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు అమ్మయ్య, పి.ఆంజనేయులు, పీపీ రంగారెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు విజయ్, నాగలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment