కదులుతున్న అక్రమాల డొంక
● మోకపై లేకున్నా పట్టాలు
● పైసలకు ప్రభుత్వ భూములు
● ముగ్గురు తహసీల్దార్లపై కేసు
చందుర్తి(వేములవాడ): కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ భూములను అప్పజెప్పారు. మోకపై లేకున్నా పట్టాలు చేశారు. పైసలు ఇస్తే ఏదైనా సాధ్యమే అంటూ చందుర్తిలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు నిరూపించారు. ఇప్పటికే ఓ తహసీల్దార్ సస్పెండ్ కావడంతో పాటు అరెస్ట్ కూడా అయ్యారు. అంతేకాకుండా మరో ఇద్దరు తహసీల్దార్‌లపై కేసులు నమోదయ్యాయి. తవ్వినకొద్దీ అవినీతి చిట్టాలు బయటపడుతున్నాయి. సమాచారహక్కు చట్టం కింద వివరాలు అడిగిన రైతులకు సమాచారం అందుబాటులో లేదని దాటవేసిన అధికారుల్లో వణుకు మొదలైంది. రెవెన్యూ అధికారుల అక్రమాలపై ‘సాక్షి’ ఫోకస్..
అంతా ‘పైసా’చికం
● చందుర్తి మండలం మర్రిగడ్డలో 103, 270 సర్వేనంబర్‌లు, చందుర్తిలోని బోడగట్టు ప్రాంతంలోని 442 సర్వేనంబర్‌లో మోకపై లేకున్నా అక్రమంగా పట్టాలు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. తహసీల్దార్‌లతోపాటు మరో ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోలపై కేసులు నమోదైనట్లు స్థానికంగా చర్చ జోరందుకుంది. భారీగా పైసలు ముట్టినట్లు ప్రచారంలో ఉంది.
● చందుర్తి మండలంలో అక్రమంగా పట్టాలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందించిన భూముల వివరాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు పనుల్లో ముంపునకు గురైన భూములకు పరిహారం చెల్లించినా వాటిని కూడా తిరిగి రికార్డుల్లోకి ఎక్కించిన వాటి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపించడంలో మండల అధికారులు తాత్సారం చేస్తున్నారు. తమ శాఖకు చెందిన అధికారులు అక్రమాలకు పాల్ప డడంతోనే ఉన్నతాధికారులకు నివేదించడంలో వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
● మండలంలోని బండపల్లికి చెందిన రైతు భూమి రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురైన 2.11 ఎకరాలకు పరిహారం పొందారు. ఆ రైతుకు 36 గుంటల భూమి మిగిలింది. రెవెన్యూశాఖలో పనిచేసే ఓ సర్వేయర్ ఆ 36 గుంటల భూమిని సదరు రైతు నుంచి కొనుగోల చేశాడు. ఆ భూమితోపాటు ముంపునకు గురైన 2.11 ఎకరాల నుంచి 2.10 ఎకరాలను సర్వేయర్, అతని భార్య పేరిట పట్టా చేయించుకున్నారు. దీనిపై చందుర్తి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వలేదు.
● చందుర్తి మండల కేంద్రంలోని 176వ సర్వే నంబర్‌లో 477.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 78 ఎకరాలు చందుర్తి నుంచి మోత్కురావుపేటకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి పోయింది. 3.02 గుంటలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో పోయింది. మిగిలిన భూమి ఉందన్న తప్పుడు నివేదికను జిల్లా అధికారులు పంపించారు. కానీ మిగులు భూమిలో సగానికి పైగా ఆక్రమణకు గురైంది. అధికారులు ఇటీవల కొనుగోలు కేంద్రానికి 10 ఎకరాలు కేటాయించారు. కబ్జా చేసిన కొందరు నాయకులు ఆ పనులు చేయకుండా స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం భూమి ఉందని, రైతులు ముందుకురావడం లేదని నివేదికను ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా 176 సర్వే నంబర్‌లో ఎంత భూమి సాగు లేకుండా ఉందో ఇప్పటికైనా తేల్చాల్చిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్థానికులు కోరుతున్నారు.
● 2013లోనే చందుర్తిలోని 176 సర్వే నంబర్‌లో 19 మంది రైతులకు 49.11 ఎకరాలు అక్రమంగా పట్టాలు చేసి పహణీలో నమోదు చేశారని వాటిని తొలగించాలని ఆర్డీవో లేఖ నంబర్: బి/934/2013 ద్వారా ఉత్తర్వులను జారీచేసిన వాటిని రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, అధికారుల అవినీతితో తొలగించలేదు.
● రైతుభరోసా తనిఖీలతో మరిన్ని అక్రమాలు బయటపడనున్నట్లు చర్చ సాగుతోంది. ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సహాయంతో సాగుభూములు తనిఖీ చేస్తే, అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని ఇప్పటి వరకు రైతుబంధు పొందిన రైతులు వివరాలు బయటపడనున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ భూములను అసైన్డ్ కమిటీ తీర్మానం లేకుండా అక్రమ ప్రొసీడింగ్స్‌తో పట్టాలు చేసిన భూముల వివరాలు బయటపడనున్నాయి.
● ఇప్పటికే కేసు నమోదైనా రిటైర్డ్ తహసీల్దార్ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కాల్వలు, చెరువుల్లో ముంపునకు గురైనా భూములను రికార్డుల్లో నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. భూములు లేకున్నా పట్టా పాసుపుస్తకాలు పొందిన వారు 30కి పైగానే ఉన్నారని సమాచారం.
రికార్డుల నుంచి ఇరిగేషన్ భూముల తొలగింపు
అక్రమ పట్టాలపై పోలీసుల విచారణకు కావాల్సిన వివరాలు అప్పగించాం. కొన్ని రికార్డులు దొరకడం లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు పనుల్లో 1,609 ఎకరాల భూమికి ఇరిగేషన్ శాఖ అధికారులు పరిహారం చెల్లించారు. గతంలో 975 ఎకరాల భూమిని రికార్డుల్లో నుంచి తొలగించాం. మిగిలిన 634 ఎకరాల భూమి తొలగించే పనిలో ఉన్నాం.
– శ్రీనివాస్, తహసీల్దార్, చందుర్తి
Comments
Please login to add a commentAdd a comment