పండుగపూట పస్తులేనా?
● జాడ లేని సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ ● సిబ్బందికి అందని వేతనాలు ● రైతులకు దక్కని రుణమాఫీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల సింగిల్‌విండోలోని ఉద్యోగులు, సిబ్బందికి మొదటి వారం దాటినా వేతనాలు జమకాలేదు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సింగిల్‌విండో సీఈవోతోపాటు మరో పది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతీ నెల 5వ తేదీలోగా వారి వేతనాలు ఖాతాల్లో జమయ్యేవి. కానీ పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్ అందుబాటులో లేరు. అతను సంతకం చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయి. కాగా జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై అరెస్టుల పర్వం కొనసాగుతుండగా సింగిల్‌విండో చైర్మన్ అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.
వేతనాలు రాక పరేషాన్
సింగిల్‌విండో సిబ్బందితోపాటు ధాన్యం కొనుగోళ్ల కోసం తాత్కాళికంగా మరో 50 మందిని నియమించారు. వారికి కూడా వేతనాలు అందలేవు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించగా సుమారు 60 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ విషయంపై వివరణ కోరేందుకు సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌కు ‘సాక్షి’ ఫోన్‌చేయగా ఆయన కుమారుడు మాట్లాడారు. తన తండ్రి అందుబాటులో లేరని ఎప్పుడు వస్తారో తెలియదని పేర్కొన్నారు. సింగిల్‌విండో సీఈవో నరేశ్‌ను వివరణ కోరగా చైర్మన్ అందుబాటులో లేరన్నారు. చైర్మన్ సంతకాలు చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment