విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో మాట్లాడారు. పోక్సో చట్టం, గంజాయి తీసుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. విద్యార్థినులకు గుడ్, బ్యాడ్ టచ్‌ల గురించి వివరించారు. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక ధారుడ్యం కలుగుతుందన్నారు. కోనరావుపేట ఎస్సైలు ప్రశాంత్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, ఎంఈవో మురళీనాయక్ పాల్గొన్నారు.
అర్హులకే పథకాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని డీఆర్డీవో, ఇన్‌చార్జి డీపీవో, మండల నోడల్ అధికారి బి.శేషాద్రి పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్‌లో సోమవారం మాట్లాడారు. మంగళవారం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు గ్రామసభలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించనున్నట్లు తెలిపా రు. ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, సూపరింటిండెంట్ రమేశ్, ఏపీవో రాజనర్సు ఉన్నారు.
భూములపై హక్కులు కల్పించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామంలో గత 80 ఏళ్లుగా కాస్తు కబ్జాలో ఉన్న భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ మండలంలోని బండలింగంపల్లికి చెందిన మాదిగలు కదంతొక్కారు. స్థానిక కొత్తబస్టాండ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు సోమవారం డప్పులు కొడుతూ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని 278, 262, 253 సర్వేనంబర్‌లోని భూములను కాస్తు చేస్తూ కబ్జాలో ఉన్నామన్నారు. గ్రామంలోని రెడ్డికులస్తులు కక్షసాధింపు చర్యలకు దిగుతూ, ఆ భూములను గ్రామ అవసరాల కోసం కేటా యించాలంటూ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్, తహసీల్దార్‌లు న్యాయ విచా రణ చేసి న్యాయం చేయాలని కోరారు.
‘ఉద్యమ కేసులు కొట్టేయండి’
సిరిసిల్లకల్చరల్: జిల్లాల పునర్‌విభజనలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నా కేసుల నుంచి విముక్తి కలగడం లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ఫలితంగా జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కంసాల మల్లేశం, మైలారం తిరుపతి, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరవేణి మల్లేశం, ఎండీ సలీం, రామాంజనేయులు వాపోయారు. సోమవారం కరీంనగర్ కోర్టులో హాజరైన సందర్భంగా మాట్లాడారు.
ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు
సిరిసిల్ల: వివిధ క్రీడల్లో నైపుణ్యం గల ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని జిల్లా యువజన, క్రీడల అధికారి అజ్మీరా రాందాస్ సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారమ్స్, హాకీ, పవర్‌లిఫ్టి్‌ంగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టి్‌ంగ్, రెజ్లింగ్–గ్రీకో రోమన్, బెస్ట్ ఫిజిక్, ఖోఖో, యోగా అంశాల్లో పాల్గొనే ఆసక్తి గల వారు ఈనెల 21లోపు వివరాలు అందజేయాలని కోరారు. ఈ పోటీలకు వెళ్లే వారికి ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment