నిరసనల హోరు.. నినాదాల జోరు
● కలెక్టరేట్ ఎదుట ధర్నాలు
సిరిసిల్లటౌన్: కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నిరసనలు.. నినాదాలతో హోరెత్తింది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు సోమవారం ధర్నాలు చేపట్టారు. సిరిసిల్లలోని లేబర్‌అడ్డాపై భవన నిర్మాణ కార్మికులకు వసతులు కల్పించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అడ్డా కూలీలకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేబర్‌కార్డులు ఇవ్వాలని కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్‌దాస్ గణేశ్, యూనియన్ అధ్యక్షుడు సిరిగిరి శ్రీనివాస్, కోల శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లు, నవీన్, రమేష్, లక్ష్మి, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో అప్పటికే భూమి ఉన్న కొందరు సర్వే నంబర్ 83లోని భూమిని కబ్జా చేసుకున్నారని కొత్తపల్లి గ్రామస్తులు ఆరోపించారు. వారంతా రైతుబంధు, రైతుబీమా పొందుతున్నారన్నారు. ఆ భూమిని వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాజు, శ్రీనివాస్ కోరారు.
● శాంతినగర్‌లో రోడ్డుపై నిర్మిస్తున్న భవనం పనులు అడ్డుకోవాలని ఏఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి సోమిశెట్టి దశరథం కోరారు. స్థానికులతో కలిసి నిరసన తెలిపారు.
● సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ కార్మికులకు రావాల్సిన బతుకమ్మ యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని రాష్ట పవర్‌లూమ్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడించారు. కార్మికులకు రోజుకు రూ.వేయి వేతనం వచ్చేలా యజమానులతో కూలీ ఒప్పందం చేయించాలని కోరారు. 2023కు సంబంధించిన యారన్ సబ్సీడి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కోడం రమణ, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment