ఆటో సురక్షితమనే నమ్మకం కలిగించాలి
● అభయ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సేఫ్టీ ● ఎస్పీ అఖిల్ మహాజన్ ● 800 ఆటోలు క్యూఆర్ కోడ్ అనుసంధానం ● ఆటో డ్రైవర్లకు ప్రమాదబీమా పత్రాలు పంపిణీ
సిరిసిల్ల: ఆటోల్లో ప్రయాణం సురక్షితమనే నమ్మకాన్ని కలిగించాలని ఆటోడ్రైవర్లకు ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో బుధవారం అభయ యాప్ క్యూఆర్ కోడ్‌ను రెండో దశలో 800 ఆటోలకు అతికించారు. ఇప్పటికే మొదటి విడతలో 4వేల ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్‌ను అందించారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తారని, వారి రక్షణ దృష్ట్యా అభయ యాప్ క్యూఆర్ కోడ్‌లో 4,800 ఆటోలను అనుసంధానించినట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లకు రూ.50తో రూ.లక్ష ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా రూ.50 చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలని తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా కీడు శంకిస్తే వెంటనే ఆటోకి ముద్రించిన ‘క్యూఆర్ కోడ్’ను స్కాన్‌చేస్తే.. డ్రైవర్ ఫొటో, వివరాలు వస్తాయన్నారు. ఆ వివరాలను యాప్‌లో ఎంట్రీ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్ వస్తుందని.. దీని ద్వారా ఆటో లైవ్ లొకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుందని ఎస్పీ వివరించారు. దీని ద్వారా ప్రయాణికులకు రక్షణ కల్పించగలుగుతామని తెలిపారు.
ఆటో ఎక్కే ముందే స్కాన్ చేస్తే
ఆటోలో ఎక్కే ముందు స్కాన్ చేస్తే గతంలో ఆటో డ్రైవర్ ఏదైనా పోలీస్ కేసులో ఉంటే.. ‘థిస్ ఆటో నాట్ సేఫ్’ అనే రెడ్‌సిగ్నల్ వస్తుందని ఎస్పీ తెలిపారు. డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్సైలు రాజు, రమేశ్, అభయ యాప్ సృష్టికర్త అభిచరణ్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment