రూ.లక్ష ఏమయ్యాయి?
● బీసీ బంధుపై విచారణ
● జిల్లాలో 1,295 మందికి మంజూరు
● రూ.12.95 కోట్లు పంపిణీ
● యూనిట్ల గ్రౌండింగ్‌పై ఆరా
ముస్తాబాద్(సిరిసిల్ల): వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగ యువతకు అందజేసిన బీసీబంధు యూనిట్లపై అధికారులు విచారణ చేపట్టారు. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయో.. లేదోనని ఆరా తీస్తున్నారు. ఎంత మేరకు ఉపాధి పొందారో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. ఈమేరకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల వివరాలు సేకరించి, యూనిట్‌ను పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుడు పనిచేస్తున్న ప్రదేశం, ఉపాధి పొందుతున్న విధానంపై ఫొటోలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 70 శాతం సర్వే పూర్తయింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2023–24కు బీసీబంధును నూరు శాతం సబ్సిడీపై ఏడాది క్రితం రూ.లక్ష చొప్పున 1,295 మందికి రూ.12.95 కోట్లను అందించారు. బీసీబంధు కోసం వేలల్లో దరఖాస్తులు రాగా 1295 మందికి నూరు శాతం సబ్సిడీపై రూ.లక్ష చొప్పున అందించారు.
వినియోగపత్రాలు అందజేసేనా..
జిల్లాలో వెనుకబడిన తరగతులలో కులవృత్తులను ప్రోత్సహిస్తూ నూరు శాతం సబ్సిడీతో రూ.లక్ష అందించారు. వారందరూ ప్రభుత్వం అందించే రూ.లక్ష ద్వారా స్వయం ఉపాధి పొందాలన్న లక్ష్యం నిర్ధేశించారు. ఎన్నికల ముందు బీసీబంధు రూ.లక్ష ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారికే బీసీబంధు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీసీబంధు ఏ మేరకు నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చింది.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఏ రుణం ఇచ్చినా.. దాని వినియోగపత్రం దాఖలు చేయాల్సిందేనన్న నిబంధనలూ ఉన్నాయి. అయితే 10 నుంచి 15 శాతం మంది లబ్ధిదారులు నాయకులు, వారి అనుయాయులేనని సమాచారం. అయితే వారు యూనిట్ల గ్రౌండింగ్ ఎలా చూపుతారనే ఆసక్తి నెలకొంది. అలాంటి వారి నుంచి రికవరీ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
రూ.లక్షతో యూనిట్ స్థాపన సాధ్యమేనా?!
బీసీబంధు నూరుశాతం సబ్సిడీతో హడావుడిగా ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున అందించారు. ఏదైనా యూనిట్ పెట్టుకుంటే సంబంధిత కంపెనీ కొటేషన్‌తోనే చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ఇక్కడ నేరుగా లబ్ధిదారుడి పేరిట రూ.లక్ష అందించారు. ఈ లక్షతో ఏ యూనిట్ పెట్టుకోవడం కూడా కష్టమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కులవృత్తులైన వడ్రంగి, రజక, నాయీబ్రాహ్మణులు, మేరు సామాజికవర్గానికి మాత్రమే బీసీబంధు అందజేశారు. వారిలో చాలా మంది కులవృత్తినే కాకుండా ఇతర కిరాణాదుకాణాలు, బ్యాంగిల్ స్టోర్స్ పెట్టుకున్నారు. రూ.లక్షతో షట్టర్ అడ్వాన్స్, ఫర్నీచర్ కొనుగోలు చేసినా దుకాణంలోకి సామగ్రి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
బీసీబంధుపై సర్వే చేపట్టాం
ముస్తాబాద్ మండల కేంద్రానికి 17 బీసీబంధు యూనిట్లు మంజూరయ్యాయి. వీటన్నింటిపై సర్వే చేసి, యూసీ అందజేశాం. ఇంకా కొంతమంది యూసీ ఇవ్వలేదు. యూనిట్ గ్రౌండింగ్‌పై ఫొటోలు తీసి, ఆ శాఖకు అందజేస్తున్నాం.
– రమేశ్, పంచాయతీ కార్యదర్శి, ముస్తాబాద్
వినియోగపత్రాలు తప్పనిసరి
బీసీబంధు లబ్ధిదారులు తాము స్థాపించిన యూనిట్ వినియోగపత్రాలు తప్పనసరిగా అందజేయాలి. యూనిట్ గ్రౌండింగ్‌పై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నాం. ఇప్పటికే 90 శాతం మంది లబ్ధిదారులు యూసీ అందజేశారు. ఎవరైనా యూనిట్ పెట్టని పక్షంలో వారిపై ఉన్నతాధికారులకు నివేదికిస్తాం. యూసీ తప్పనిసరిగా అందజేయాలి.
– రాజమనోహర్‌రావు, బీసీడీవో, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment