అవసరమైతే ఆత్మాహుతి దాడులు! | - | Sakshi
Sakshi News home page

అవసరమైతే ఆత్మాహుతి దాడులు!

Published Fri, May 19 2023 5:22 AM | Last Updated on Fri, May 19 2023 5:22 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు హైదరాబాద్‌–భోపాల్‌ల్లో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి సిద్ధమవుతున్న ఈ మాడ్యుల్స్‌కు విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ప్రధాన సూత్రధారులుగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ సలీం, భోపాల్‌ వాసి యాసిర్‌ ఖాన్‌ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్‌ అధికారులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేయడానికి సిద్ధమవ్వాలంటూ వీరికి ఆదేశాలు అందినట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్ల నుంచి 50 ఆడియోలు రికవరీ..

ఏటీఎస్‌ అధికారులు హైదరాబాద్‌తో పాటు భోపాల్‌లో అరెస్టు చేసిన 16 మందినీ న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిటీలో చిక్కిన అయిదుగురితో పాటు భోపాల్‌లో అరెస్టు అయిన యాసిర్‌ ఖాన్‌ను నగరానికి తీసుకువచ్చి సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేసి వెళ్లారు. ఈ ఉగ్రవాదులు సమాచార మార్పిడి కోసం రాకెట్‌ చాట్‌, త్రీమా యాప్స్‌ వినియోగించారు. ఎప్పటికప్పుడు వాటిలోని డేటాను డిలీట్‌ చేశారు. ఈ కారణంగానే వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో కీలకమైన సమా చారం లభించలేదు. దీంతో వీటిని విశ్లేషించడానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. గోల్కొండలో నివసించిన భోపాల్‌ వాసి మహ్మద్‌ సలీం, భోపాల్‌లోని షాజహానాబాద్‌కు చెందిన యాసిర్‌తో పాటు మరో ఉగ్రవాది ఫోన్లను విశ్లేషించిన ఫోరెన్సిక్‌ నిపుణులు వాటి నుంచి కొంత డేటాతో పాటు 50 ఆడియో ఫైల్స్‌ రికవరీ చేశారు. ఈ ఆడియోల్లోనే ఆత్మాహుతి దాడులకు సంబంధించిన ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్‌ అధికారులు గుర్తించారు.

టూ వే కమ్యూనికేషన్‌ ఉన్నప్పటికీ...

ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్‌ కిల్లింగ్‌), సెబోటేజ్‌ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్‌ కిల్లింగ్‌) అంశాలతో పాటు ఆత్మాహుతి (ఫిదాయీన్‌) దాడులు సంబంధించిన అంశాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మూడు ఫోన్ల నుంచి రికవరీ చేసిన డేటాలో టూ వే కమ్యూనికేషన్‌ను గుర్తించారు. అంటే ఈ ఉగ్రవాదులతో పాటు వీరికి ఆదేశాలు, సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తికి సంబంధించిన సందేశాలూ రిట్రీవ్‌ అయ్యాయి. అవి ఎవరు పంపారనేది మాత్రం ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించలేకపోయారు. ఆ వివరాలు కేవలం యాప్‌లోనే నిక్షిప్తమై ఉంటాయని నివేదిక ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తులను గుర్తించడం కోసం కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. మరోపక్క వీరి ఫోన్లకు కొన్ని పాకిస్థాన్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వచ్చినట్లు, కాంటాక్ట్స్‌ లిస్టులోనూ ఆ దేశం నంబర్ల ఉన్నట్లు ఏటీఎస్‌ చెబుతోంది. అవి ఎవరివి? వారితో వీరికి ఉన్న సంబంధాలేంటి? అనే కోణంలో ఆరా తీస్తోంది.

కొన్ని ఆడియోల్లో కఫీల్‌ అహ్మద్‌ ప్రస్తావన..

ముగ్గురు ఉగ్రవాదుల ఫోన్ల నుంచి రిట్రీవ్‌ చేసిన ఆడియోల్లో లండన్‌లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవబాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన కఫీల్‌ అహ్మద్‌ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్‌ గుర్తించింది. ఇతడి సోదరుడు నబీల్‌ అహ్మద్‌ని సైతం ఎన్‌ఐఏ అధికారులు 2012లో ఢిల్లీలో అరెస్టు చేశారు. లష్క రేతొయిబా (ఎల్‌ఈటీ) సంస్థ కోసం ఉగ్రవాదు లను రిక్రూట్‌ చేస్తున్నట్లు ఇతడిపై అభియోగాలు ఉన్నాయి. కఫీల్‌ అహ్మద్‌ హిజ్బ్‌ ఉత్‌ తెహరీర్‌ (హెచ్‌యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారా డు. హైదరాబాద్‌–భోపాల్‌ మాడ్యుల్‌ ఉగ్రవాదులూ తొలినాళ్లలో అదే ఉగ్రవాద సంస్థ తరఫున పని చేశా రు. ఈ నేపథ్యంలోనే ఆ ఆడియోలు హెచ్‌యూటీ హ్లాండ్లర్‌గా భావిస్తున్నారు. మరోవైపు ఏటీఎస్‌ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదురోజులు కస్టడీ కోరా లని ఏటీఎస్‌ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గు రు నగర వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. వీరి నుంచీ వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.

హైదరాబాద్‌–భోపాల్‌ మాడ్యుల్స్‌ని రెచ్చగొట్టిన అజ్ఞాతవాసి

సలీమ్‌, యాసిర్‌ ఫోన్ల నుంచి ప్రసంగాల ఆడియోలు రికవరీ

వాటిలో ఫిదాయీన్‌ దాడులకు సంబంధించిన పలు అంశాలు

వీటిని పంపింది ఎవరో గుర్తించే పనిలో కేంద్ర నిఘా వర్గాలు

నేటితో ముగియనున్న 16 మంది ఉగ్రవాదుల పోలీస్‌ కస్టడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement