రాయదుర్గం: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అ బాండెడ్, అన్‌క్లెయిమ్డ్ వాహనాలకు సంబంధించి ఇప్పటి వరకు పది దశల్లో వేలం వేసినట్లు గురువారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొత్తం 9,627 వాహనాల ఆక్షన్ నిర్వహించామన్నారు. వీటి వేలంతో రూ.6 కోట్ల వరకు సమీకరించినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 4,702 అబాండెడ్, అన్‌క్లెయిమ్డ్ వాహనాలకి సంబంధించి 8 ప్రొక్లెమేషన్ నోటీసులను సైతం రిలీజ్ చేశామన్నారు. రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లలో ఇలాంటివి సుమారు 6 వేలకు పైగా వాహనాలు ఉన్నాయని, వాటికీ నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలో వాటిని కూడా వేలం వేస్తామని సీపీ తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. అభ్యంతరాలు ఉన్న యజమానులు ఆరు నెలల కాల పరిమితిలోపు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో సంబంధిత పోలీస్ స్టేషన్ అఽధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఓయూ ఇంజినీరింగ్ కోర్సుల ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ వివిధ విభాగాల ఫైనలియర్ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ నెల 16న ప్రారంభమై 20న ముగిసిన పరీక్ష ఫలితాలను రికార్డు స్థాయిలో ఐదు రోజుల్లో విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. సివిల్ 98.44 శాతం, మెకానికల్ 100, ఎలక్ట్రికల్ 100, ఎలక్ట్రానిక్స్ 98.11, కంప్యూటర్ సైన్స్ 100, బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సు లో 100 శాతం మంది విద్యార్థులు పాస్‌కాగా మొత్తం 99.46 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఎయిర్‌పోర్టులో
బంగారం పట్టివేత
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్ల్యూవై–231 విమానంలో మస్కట్ నుంచి గురువారం ఉదయం వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్యాప్సుల్స్‌లో పేస్టురూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు గుర్తించారు. 685.75 గ్రాముల బంగారం విలువ రూ.42.78 లక్షల ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వర్గీకరణకు చట్టబద్ధత
కల్పించే వరకు పోరాటం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
గోవిందు నరేష్ మాదిగ
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటం ఆగదని ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ స్పష్టం చేశారు. పట్టణంలోని పెన్షన్స్ భవనంలో గురువారం సంఘం జిల్లా కన్వీనర్ పెంటనోళ్ల నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన మాదిగలు, మాదిగ ఉపకులాలకు 12శాతం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జూలైలో లక్షలాది మందితో ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ 2 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మద్దిలేటి, శంకర్‌రావు, రత్నం, అనంతయ్య, శ్రీకాంత్, శ్రావణ్‌కుమార్, బొబ్బిలి పాండు, అశోక్, నాగభూషణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment