కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్
బృందం కితాబు
ఇబ్రహీంపట్నం రూరల్: జలశక్తి అభియాన్ ద్వారా నీటిని నిల్వ ఉంచే ప్రయత్నంలో భాగంగా ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోరుబావులు, చెక్ డ్యాంల నిర్మాణం చాలా బాగుందని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ బృందం కితాబిచ్చింది. కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ బృందం సభ్యుడు అంకిత్ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ అంకిత్ విశ్వకర్మ, సైంటిస్ట్‌లు మంగళవారం జిల్లాలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలశక్తి అభియాన్ ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ విరించారు. జిల్లా లోని 558 గ్రామ పంచాయతీల్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి, నాటిన మొక్కలను సంరక్షిస్తున్నట్టు తెలిపారు. గ్రామ నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించడం జరిగిందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, ఉద్యాన శాఖ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సౌందరరాజన్‌కు చిలుకూరు ఆధ్యాత్మిక రత్న బిరుదు
మొయినాబాద్: మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్, ప్రధాన అర్చకుడు సౌందరరాజన్‌కు చిలుకూరు ఆధ్యాత్మిక రత్న బిరుదు లభించింది. చిలుకూరులోని శ్రీ గురుబసవ గురు పాద లింగ మఠం వారు సౌందరరాజన్‌కు చిలుకూరు ఆధ్యాత్మిక రత్న బిరుదును ప్రదానం చేశారు. ఇటీవల చిలుకూరు బాలాజీ దేవా లయం సమీపంలోని శ్రీ గురుబసవ గురుపాద లింగ మఠంలో జరిగిన కార్యక్రమంలో సౌందరరాజన్ తరఫున హాజరైన ఆయన కుమారుడు రంగరాజన్‌కు బిరుదు, ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. వృధ్యాప్యం కారణంగా సౌందరరాజన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు పురాణం వీరభద్రస్వామి, నాయకులు సుధాకర్, లింగస్వామి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా మెట్లబావి
● బన్సిలాల్‌పేట తరహా అభివృద్ధి చేస్తాం
● మంత్రి సబితారెడ్డి
మహేశ్వరం: కాకతీయ చరిత్ర ఉట్టి పడేలా మహేశ్వరంలో పురాతన కోనేరు మెట్ల బావిని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మండల కేంద్రంలోని కోనేరు మెట్ల బావిని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బన్సీలాల్‌పేటలోని మెట్లబావి తరహాలో మహేశ్వరం మెట్ల బావిని సుమారు రూ.కోటి నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. పురాతన కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అంతకు ముందు టీఎస్‌ఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రెవె న్యూ ఇతర శాఖల అధికారులతో మెట్ల బావి అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్ రవికుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ మహమూద్ అలీ, మహేశ్వరం సర్పంచ్ ప్రియంక, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంగోత్ రాజు నాయక్, మండల కోఆప్షన్ సభ్యుడు అదిల్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment