ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Published Tue, Jun 6 2023 4:36 AM | Last Updated on Tue, Jun 6 2023 4:36 AM

- - Sakshi

హయత్‌నగర్‌: మండలంలోని సాహెబ్‌నగర్‌లో సర్వే నంబర్‌ 71/1లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్కార్‌ భూమిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు బినామీ పేర్లతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ‘ప్రభుత్వ భూమికి ఎసరు’ శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ యాదవ్‌ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో సిబ్బంది 11 ఇంటి నిర్మాణాలు, 5 ప్రహరీలను కూల్చివేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు అంజనేయులు, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బడంగ్‌పేట్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (కందుకూరు బాలురు) నాదర్‌గుల్‌ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అర్హులు కావాలని ప్రిన్సిపాల్‌ రఘునందన్‌రావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. బాటనీ జేఎల్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ జేఎల్‌, గణిత శాస్త్రం జేఎల్‌, పీజీటీ తెలుగు, పీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్‌, గణిత శాస్త్రం పీజీటీ, భౌతిక శాస్త్రం పీజీటీ, సాంఘిక శాస్త్రం పీజీటీ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పీజీ, బీఎడ్‌ అర్హత కలిగి ఉండాలన్నారు. జేఎల్‌కు రూ.23వేలు, టీచర్‌కు రూ.18 వేలు ప్రతీనెల అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల నాదర్‌గుల్‌ (నోబుల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నాదర్‌గుల్‌)లో గానీ, 79950 10637 నంబర్‌లో గానీ సంప్రదించాలని సూచించారు.

నగర పంచాయతీల్లో ఉపాధి పనులు చేపట్టాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో ఉపాఽధి హామీ పనులు వెంటనే చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి నిధులు తగ్గించిందని, ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేయాలని చూస్తోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతంలో తీవ్రమైన ఎండల్లో కూడా ఉపాధి కూలీలు పని చేస్తున్నారని, పని ప్రదేశాల్లో కనీస వసతులు కరువయ్యాయన్నారు. వైద్య కిట్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కూలీలు పాల్గొన్నారు.

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు

పనులు వెంటనే చేపట్టాలి

కొందుర్గు: లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని టీపీసీసీ కార్యదర్శి ఆలుగడ్డ ప్రవీణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మించడానికి గుర్తించిన ప్రదేశంలో సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఈ ప్రాంత ప్రజలకు ప్రాజెక్టు నిర్మిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొన్నారని, అధికారం చేపట్టాక మరిచిపోయారన్నారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పుష్పమ్మ, ఇందిర, చంద్రకళ, వెంకటయ్య గౌడ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌, నవీన్‌, శంకర్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నేతలు  
1
1/3

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నేతలు

జేసీబీతో నిర్మాణాల కూల్చివేత2
2/3

జేసీబీతో నిర్మాణాల కూల్చివేత

3
3/3

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement