పారిశుద్ధ్య పనుల్లో
మంతన్‌గౌరెల్లి సర్పంచ్
యాచారం: మంతన్‌గౌరెల్లి సర్పంచ్ విజయలక్ష్మి మంగళవారం గ్రామంలో పారిశుద్ధ్యం పనుల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పంచాయతీ సిబ్బంది సమ్మెతో గ్రామంలోని పలు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షంతో తీవ్ర దుర్వాసన నెలకొంది. ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రహించిన సర్పంచ్ పంచాయతీ ట్రాక్టర్‌ను ఓ గ్రామస్తుడితో నడిపిస్తూ పలు కాలనీల్లో ఉన్న చెత్తను స్వయంగా తీసుకుని ట్రాక్టర్‌లో నింపారు. ఇలా పలు కాలనీల్లో చెత్తను సేకరించి గ్రామానికి దూరంగా పడేయించారు. సర్పంచే స్వయంగా ట్రాక్టర్‌లో వచ్చి చెత్తను సేకరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గెస్ట్ లెక్చరర్స్ కోసం
దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ నియామకం కోసం ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రభు కోరారు. తెలుగు, హిస్టరీ, క్రాప్ ప్రొడక్షన్లకు ఒక్కొక్క పోస్టు, కంప్యూటర్ సైన్స్‌కు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత పీజీ కోర్సులో 55 శాతం, ఎస్సీ,ఎస్టీలు 50 శాతం కలిగి ఉండాలని, బోధన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. వివరాలకు 94405 71781 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
120 కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి
ముషీరాబాద్: బీసీ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలని. ఇందుకోసం కొత్తగా 120 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ భవన్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లు లభించక విద్యార్థులు ఆఫీసుల చుట్టు తిరుగుతున్నారని, పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు రాగా కేవలం 8 వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారని తెలిపారు. వెంటనే 238 బీసీ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులకు అదనపు సెక్షన్లు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో నీల వెంకటేష్, సి.రాజేందర్, నర్సింహగౌడ్, రాందేవ్, భాస్కర్ ప్రజాపతి, బాసయ్య, రవి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
రెండు వేర్వేరు కేసుల్లో అక్రమ బంగారం పట్టివేత
శంషాబాద్: రెండు వేర్వేరు కేసుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సోమ వారం అర్థరాత్రి కువైట్ నుంచి బయలుదేరిన ప్రయాణికుడు వయా దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా లగేజీని తనిఖీ చేయడంతో 1225 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.72.55 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో కువైట్ నుంచి వయా దోహా మీదుగా వచ్చిన మరో ప్రయాణికుడి లగేజీలో 500 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ.30.51 లక్షలుగా నిర్దారించారు. ఈ మేరకు నిందితులిద్దరీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment