కల్తీ.. అడ్డుకట్ట ఏదీ?
మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ క్యాంటిన్‌లో పురుగుపట్టిన నాసిరకం పప్పును వడ్డిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నమూనాలు సేకరించారు. పరీక్షించగా ఆహారం అన్‌సేఫ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా ఫుడ్‌సేప్టీ అధికారులు క్యాంటిన్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
తుక్కుగూడలోని ఎస్‌ఎన్‌గ్రాండ్ హోటల్ నిర్వాహకులు బిర్యానీలో సామర్థ్యానికి మించి సింథటిక్ కలర్స్ వినియోగించినట్లు ఫిర్యాదు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, హోటల్లో తనిఖీలు నిర్వహించారు. నమూనాలు సేకరించి, పరీక్షించగా, ఈ ఆహారం తినడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
కిస్మత్‌పూర్‌లోని కపానరస్టా కిచెన్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో బిర్యానీలో సామర్థ్యానికి మించి సింథటిక్ కలర్స్ కలిపినట్లు ఫుడ్‌సేప్టీ అధికారుల పరిశీలనలో తేలింది. ఫుడ్ సేప్టీ అధికారులు నమూనాలు సేకరించి, కేసు నమోదు చేయించారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 నమూనాలు సేకరించి పరీక్షించగా, వీటిలో 17 నమూనాలు అన్‌సేఫ్‌గా నిర్ధారణ అయినట్లు తేలింది. ఆయా హోటళ్లు, డెయిరీ ఫామ్‌లపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నా కల్తీ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. మోతాదుకు మించి సింథటిక్ కలర్ల వాడకం, కల్తీ ఆహార పదార్థాలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేక మంది కేన్సర్, జీర్ణకోశ వ్యాధుల బారినపడుతుండటానికి ఇదే ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్వం కల్తీమయం
జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న హోటళ్లు, రెస్టారెంట్లు 2000 పైగా ఉన్నాయి. చిరుతిళ్లు అమ్మే తోపుడు బండ్లు, ట్రక్‌లు, పానీపురి డబ్బాలు, నూడిల్స్ కేంద్రాలు మరో వెయ్యికిపైగా ఉన్నట్లు అంచనా. వీటితో పాటు 234 వైన్‌షాపులు, 300కుపైగా ప్రైవేటు హాస్టళ్లు, 200 ఇంటర్మీడియెట్ ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలు, మరో ఐదు వందలకుపైగా ఐస్‌క్రీం పార్లర్లు, పాల డెయిరీలు, బేకరీలు ఉన్నాయి. పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆస్పత్రుల్లో క్యాంటిన్లు కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా మసాల తయారీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. మెజార్టీ హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాలు ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా విస్తరించిన మున్సిపాలిటీల్లోనే ఉన్నాయి. వీటిలో విధిగా తనిఖీలు నిర్వహించి, ఆహార ప్రియులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాల్సి ఉంది. కానీ జిల్లాలో హోటళ్ల సామర్థ్యం మేరకు ఫుడ్ సేప్టీ ఆఫీసర్లు లేరు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన ఈ హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయడం వీరికి కష్టంగా మారుతోంది. ఆహారప్రియులు ఫిర్యాదు చేసినా సకాలంలో అటెండ్ కాలేని దుస్థితి. ప్రతినెలా మొక్కబడిగా తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపడం మినహా ప్రజారోగ్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే అపవాదు లేకపోలేదు. కాటేదాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న మసాల, అల్లం వెల్లుల్లి, ఐస్‌క్రీం పార్లర్లు, నెయ్యి ప్యాకింగ్ కేంద్రాల్లో తరచూ కల్తీ ఆహారం పట్టుబడుతూనే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టులో ఆలు కలుపుతున్నారు. అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్, ఫిష్, మటన్‌కు సింథటిక్ కలర్లు అద్ది.. మసాలాలు దట్టించి, నూనెలో వేపి విక్రయిస్తున్నారు. వీటిని తిన్న ఆహారప్రియులు అనారోగ్యం బారినపడుతున్నారు.
పిల్లలు తాగే పాలు సైతం
గ్రేటర్ జిల్లాలకు నిత్యం సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా, 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో, మరో ఆరు లక్షలు డబ్బా వాలాలు సమకూరుస్తున్నారు. పిల్లలకు స్వచ్ఛమైన పాలను పట్టించాలని తల్లిదండ్రుల్లో ఉన్న వీక్‌నెస్‌ను డెయిరీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అధిక పాల దిగుబడి కోసం పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు సహా, బీర్‌దాణా వంటి హానికరమైన ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ప్రత్యక్షంగా పశువుల ఆయుః ప్రమాణాన్ని తగ్గించడంతో పాటు పరోక్షంగా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. మరికొంత మందైతే ఏకంగా కృత్రిమ పాలను తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్‌గుల్, ముచ్చింతల, పసుమాములలోని పలు డెయిరీల్లో తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించి పరీక్షించగా విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాల నాణ్యత లేకపోవడంతో ఆయా వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. డబ్బావాలాలు ఏకంగా తాగేందుకు ఏమాత్రం సురక్షితం కాని ఈకొలి బ్యాక్టీరియాతో కూడిన నల్లా నీళ్లను కలుపుతున్నారు. కల్తీ పదార్థాలు తగ్గకపోగా, మరింత పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఆహార కల్తీపై ఫిర్యాదు చేయండి
జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 94923 01835
టోల్ ఫ్రీ నంబర్: 040–21111111
కనిపించని ‘ఫుడ్ సేఫ్టీ’
ఆహారపదార్థాలన్నీ నాసిరకం
యథేచ్ఛగా మిక్సింగ్‌లు
ప్రజారోగ్యంతో చెలగాటం
తనిఖీలు అంతంతమాత్రం
Comments
Please login to add a commentAdd a comment