రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ
ఇబ్రహీంపట్నం: స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వ భిక్షకాదని, విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడంలేదని మండిపడ్డారు. గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం భ్రుష్టుపట్టిస్తోందని దుయ్యబట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు సంజీవని లాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. మూడేళ్లుగా రూ.7,500 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌పై ఆధారపడి విద్యనభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి విద్యార్థులను ఆదుకునేందుకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కందాడి శ్రీరామ్, కళ్లెం సూర్యప్రకాశ్, డి.శివకృష్ణ, పయ్యాంశెట్టి జగదీశ్, రుద్రపాల మహేందర్, నవీన్, పవన్, చరణ్, ఆదర్శ్, శివ, కార్తీక్, రాజేశ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment