తౌటోనికుంట పునరుద్ధరణపై హైడ్రా దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్‌ఆర్) సమీపంలోని ఖాజాగూడలో ఉన్న తౌటోని కుంట పునరుద్ధరణపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి సారించింది. బుధవారం చెరువును కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి తౌటోని కుంటలోకి నీరు చేరేందుకు ఉన్న మార్గాలను పరిశీలించారు. ‘మనూ’కు చెందిన ఖాళీ స్థలంలో నిలుస్తున్న వర్షపు నీరు సమీపంలోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వస్తోందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆ నీరు నేరుగా తౌటోనికుంటకు చేరితే ఈ ఇబ్బంది ఉండదన్నారు. దీంతో పాటు ఈ చెరువు నిండితే అలుగు పారే నీరు నేరుగా భగీరథమ్మ చెరువుకు చేరేలా కాల్వలు ఏర్పాటు చేయాలని అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. జనావాసాల మధ్య ఉన్న చెరువుల పరిరక్షణకు హైడ్రా కట్టుబడి ఉందని, తొలుత ఎఫ్‌టీఎల్ నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment