జైళ్లకు భయపడే ప్రసక్తే లేదు
పరిగి: ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా సరే.. రైతుల పక్షాన పోరాటం చేసేందుకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిగి సబ్ జైలులో ఉన్న ఫార్మా బాధిత రైతులను కలిసి మాట్లాడారు. గురువారం పలువురు మాజీ ఎమ్మెల్యేలతో వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటన ఎలా జరిగింది..? ఎవరిపై కేసులు పెట్టారు.. ఎవరిని అరెస్టు చేసి జైలుకు పంపారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ బాధపడొద్దని, బీఆర్‌ఎస్ తరఫున తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జైల్లో, బయట ఉన్న ఫార్మా బాధితుల పరిస్థితిని చెప్పడం కూడా కష్టంగా ఉందన్నారు. దాడుల్లో పాల్గొనని వారిని సైతం జైలు పాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమాయక ప్రజలను కొట్టడంతో పాటు బలవంతంగా కేసులు ఒప్పించి, రిమాండ్ చేయడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వదిలేసి, బీఆర్‌ఎస్ మద్దతుదారులను లోపల వేశారని మండిపడ్డారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఆయనకు ఓట్లేసిన ప్రజలపై కేసులు పెట్టిస్తారా అని నిలదీశారు. ఇంత గొడవ జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రైతులకు భరోసా కల్పించాల్సింది పోయి, కేసులు పెట్టించి జైలు పాలు చేస్తారా.. అని నిలదీశారు. లగచర్లతో పాటు తండాల్లో రాత్రివేళ చొరబడిన పోలీసులు, కనిపించిన వారిని కొట్టడంతో పాటు భయానక వాతావరణం సృష్టించారని, కేసుతో ఏ సంబంధం లేని వారిని సైతం పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఆడపిల్లలు అడ్డం వాస్తే వాళ్లపై కూడా దాడులు చేయడం ఏమి టని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం అమాయకులను జైలు పాలు చేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు లేనిపోని కుట్రలు చేస్తున్నారన్నారు.
ఫోన్ మాట్లాడటం నేరమా..?
ఐదేళ్ల పాటు కొడంగల్ ప్రజలకు సేవ చేసిన ఓ మాజీ ఎమ్మెల్యేగా బాధితులు నరేందర్‌రెడ్డికి ఫోన్ చేయడం తప్పా..? ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, అండగా ఉంటామని ధీమా ఇవ్వడం మినహా నరేందర్‌రెడ్డి చేసిన నేరం ఏమిటని నిలదీశారు. కేసులు, జైళ్లకు భయపడే ప్రసకేస్త లేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రక్షణే ధ్యేయంగా బీఆర్‌ఎస్ కొట్లాడుతుందని సబితారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ నిషాన్ చెరిపేస్తాం అని సీఎం అంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని తెలిపారు. సీఎం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఎన్నిసార్లయినా లగచర్ల ప్రజలు నరేందర్‌రెడ్డికి ఫోన్లు చేస్తారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఇలా అన్యాయంగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. నరేందర్‌రెడ్డి తనతో మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికై నా సిద్ధమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, హరిప్రియనాయక్, కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
రైతులు, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది
లగచర్ల కేసుతో సంబంధం లేని వారిపై కేసులు పెడుతున్నారు
అమాయకులను నిర్బంధించారు
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
పరిగి జైలులో ఫార్మా బాధిత రైతులకు పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment