పథకాలు సకాలంలో అందాలి
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: షెడ్యూల్డ్ కులాల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను సకాలంలో చేరేలా చూడాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం సమావేశం మందిరంలో గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి షెడ్యూల్డ్ కులాలకు వివిధ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్టుమెట్రిక్స్ స్కాలర్‌షిప్‌లు ఏ మేరకు అందుతున్నాయి.. ఎస్సీ జూనియర్ అడ్వొకేట్లకు ప్రోత్సాహకాలు అందుతున్నాయా.. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలకు ఎంజీఎన్‌ఆర్ స్కీం ద్వారా ఎన్ని నిధులు విడుదలయ్యాయి.. విడుదలైన నిధుల ద్వారా ఎన్ని కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టారు తదితర అంశాలపై ఆరా తీశారు.
ఎస్సీల భూములకు రక్షణ కల్పించాలి
ఎస్సీ కులాలకు ఇచ్చిన భూముల పరిరక్షణలో రెవెన్యూ శాఖ దృష్టి సారించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. ఎవరైనా కేసులు నమోదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఆయా శాఖలు సకాలంలో ఖర్చుచేసి షెడ్యూల్ కులాల వారి సంక్షేమానికి అన్ని శాఖలు కృషి చేయాలని తెలిపారు. ముందుగా కలెక్టరేట్‌కు చేరుకున్న రాంచందర్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కను నాటారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని, ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీత, ఎల్బీనగర్ డీసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment