స్పష్టత లేకుండా ఎలా సర్వే చేస్తారు?
కందుకూరు: తమకు భూమికి భూమి ఇస్తారా.. లేదంటే పరిహారమా.. లేక ఫూలింగ్ పద్ధతిలో సేకరించనున్నారా అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే తమ భూముల్లో సర్వే చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీలోకి నేరుగా చేరుకునేలా నిర్మించనున్న రహదారికి అవసరమైన భూసేకరణ విషయంలో గురువారం రెవెన్యూ అధికారులు మండల పరిధిలోని అగర్‌మియాగూడ పరిధిలో సర్వే చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య సర్వే పనులు చేపట్టారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి సేకరించిన భూముల్లోకి చేరుకునేలా రహదారులు ఉండగా మళ్లీ కొత్తగా 330 అడుగుల రహదారి ఎందుకని రైతులు ప్రశ్నించారు. శ్రీశైలం రహదారిని విస్తరిస్తే తమ భూములు కోల్పోవాల్సిన అవసరం ఉండదన్నారు. తమ భూములు తీసుకుని ఏం ఇస్తారో చెప్పకుండా సర్వే ఎలా చేస్తారని నిలదీశారు. సర్వే చేస్తేనే ఎవరి భూమి ఎంత మేర పోతుందో తేలుతుందని.. ఆ తర్వాతే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుందని అధికారులు నచ్చజెప్పారు. అనంతరం రైతులు తమ డిమాండ్లను వినతిపత్రం రూపంలో ఆర్డీఓకు అందించారు.
అధికారులను నిలదీసిన రైతులు
Comments
Please login to add a commentAdd a comment