తీరని విషాదం
● లారీ ప్రమాద మృతులకు అశ్రునయనాలతో అంత్యక్రియలు
● ఆలూరు, నాంచేరి గ్రామాల్లో అలుముకున్న విషాదఛాయలు
చేవెళ్ల: మండలంలోని ఆలూరు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆలూరు, నాంచేరి గ్రామాల్లోని విషాదం అలుముకుంది. ఆయా గ్రామాల్లో మంగళవారం అంత్యక్రియల సందర్భంగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతా వ్యవసాయం, కూలి పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే. ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (48) వ్యవసాయం చేస్తూ.. కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య మాధవి కొడుకు, కూతురు ఉన్నారు. కూరగాయలు అమ్మి వస్తానని చెప్పి వెళ్లి.. దూరంగా వెళ్లావా.. మేమెలా బతకాలి అంటూ భార్య మాధవి రోదనలు కంటతడిపెట్టించాయి. అదే గ్రామానికి చెందిన మరో కుటుంబంలోని దామరగిద్ద జంగయ్య, యాదమ్మ వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలను చక్కగా చదివించారు. కూతురుకు టీచర్ ఉద్యోగం రాగా ముగ్గురు కొడుకులు బీఈడీ, డీఎడ్, ఐటీఐ చదివారు. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు తల్లిదండ్రులకు సాయంగా వ్యవసాయం, కూరగాయలు విక్రయించే పనులు చేస్తున్నారు. చిన్న కొడుకు కృష్ణ (19) మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కృష్ణ ఐటీఐ చదివి రైల్వే ఉద్యోగంకోసం ఇటీవలే పరీక్ష రాసి ఫలితాలకోసం ఎదురు చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. అన్న కూరగాయలు విక్రయించే చోటుకు టమాటా బాక్స్‌లు ఇచ్చేందుకు వచ్చి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. అన్నకు సాయంగా వెళ్లి అనంతలోకాలకు వెళ్లావా అంటూ తల్లి యాదమ్మ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
కలచివేసిన రోదనలు
నాంచేరి గ్రామానికి చెందిన శ్యామల సుజాత (42), భర్త వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా తరచూ కూరగాయలు విక్రయిస్తూ భర్త, కొడుకును చూసుకునే శ్యామల సుజాత మరణం వారి కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ప్రమాద సంఘటన నుంచి మంగళవారం అంత్యక్రియల వరకు ‘అమ్మా.. నన్ను వదిలి వెళ్లావా’ అంటూ కొడుకు రోదనలు అందరినీ కలిచి వేశాయి. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బాధితులకు ఒక్కొక్కరికి రూ.20 వేల ఆర్థిక సాయం చేశారు. మార్కెట్ చైర్మన్ పెంటయ్య గౌడ్ సైతం సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment