రేపు జాబ్‌మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6న ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని రిటైల్, ఈ కామర్స్, బ్యాంకింగ్, బీపీఓ రంగాల్లో పోస్టులు ఉన్నట్టు చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఐటీఐ డిప్లమా పూర్తి చేసి, 18 నుంచి 30 ఏళ్ల లోబడి ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, శాంతినగర్ మల్లేపల్లిలో హాజరుకావాలన్నారు. వివరాలకు 99634 93453, 90630 99306 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నిర్బంధాలతో
ఉద్యమాన్ని ఆపలేరు
హుడాకాంప్లెక్స్: నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని తెలంగాణ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు బాలకిషన్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొందరి కుట్రలకు తలొగ్గి, ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు. మాలలను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు.
అంతర్జాతీయ సదస్సుకు షాద్‌నగర్ అధ్యాపకుడు
షాద్‌నగర్‌రూరల్: సింగపూర్ యూనివర్సిటీలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు షాద్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు సామ రవీందర్‌రెడ్డి మంగళవారం సింగపూర్‌కు చేరుకున్నారు. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రతినిధి ప్రొఫెసర్ థాం షాంగైను అక్కడి ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో దేశం తరఫున ‘అర్బన్ డెవలప్‌మెంట్ స్ట్రాటజీ కై ్లమేట్ మిటిగేషన్’ అంశంపై రాసిన పరిశోధన పత్రాన్ని ప్రజెంట్ చేయనున్నారు. భారతదేశం ప్రస్తుతం వాతావరణంలో మార్పును ప్రధాన సమస్యగా ఎదుర్కొంటోందని, ఈ సమస్యను అధిగమించి అభివద్ధి చెందే విధంగా ప్రజెంటేషన్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని రవీందర్‌రెడ్డి తెలిపారు.
దుర్గమ్మసేవలో ‘పట్నం’ న్యాయమూర్తి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల దుర్గమ్మను ఇబ్రహీంపట్నం ఏడవ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రీటాలాల్ చంద్ దంపతులు మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తి దంపతులను ఆలయ అధికారులు సత్కరించారు.
విద్యుత్ అధికారులతో ఎస్‌ఈ సమీక్ష
షాద్‌నగర్: విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ట్రాన్స్ కో ఎస్‌ఈ రామ్మోహన్ సూచించారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. గ్రామాలు, పట్టణంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే గుర్తించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి, గృహ, వ్యాపార సముదాయాలకు అవసరమైన కరెంటు సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో డీఈ శ్యాంసుందర్‌రెడ్డి, ఏడీఈలు సత్యనారాయణ, రవీందర్, ఏఈ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment