సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీకి 15 మంది సభ్యుల ఎన్నిక ఈ నెల 25న జరగనుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఎన్నిక షెడ్యూలు విడుదల చేశారు. ప్రస్తుతం పాలకమండలిలో సభ్యులుగా ఉన్న 146 మంది వార్డు సభ్యులు (కార్పొరేటర్లు) స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. షెడ్యూలు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఎన్నిక నోటిఫికేషన్: 5–2–2025
నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 10 నుంచి 17వ తేదీ వరకు. 16 తేదీ ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
నామినేషన్లు స్వీకరించే స్థలం: సెక్రటరీ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ ప్రధానకార్యాలయం.
నామినేషన్ల జాబితా వెల్లడి: 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత.
నామినేషన్ల పరిశీలన: 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.
అర్హుల తుది జాబితా: 18న పరిశీలన పూర్తయ్యాక.
నామినేషన్ల ఉపసంహరణ గడువు: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు.
పోటీలో మిగిలిన అభ్యర్థుల జాబితా: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత.
ఎన్నిక: 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
ఎన్నిక జరిగే ప్రదేశం: కమిషనర్ కార్యాలయం.
ఓట్ల లెక్కింపు: 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత.
ఫలితం వెల్లడి: ఓట్ల లెక్కింపు పూర్తికాగానే.
రసవత్తరం.. బరిలో ఎవరో?
ఈసారి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ప్రస్తుత పాలకమండలి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీఆర్‌ఎస్–ఎంఐఎం మైత్రీబంధంతో స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకుండా ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగాయి. పాలకమండలి ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్ అధికారంలో ఉండటం, కార్పొరేటర్లు సైతం బీఆర్‌ఎస్ నుంచి ఎక్కువమంది గెలవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు.. తర్వాత ఉప ఎన్నికలో ఒక వార్డు గెలుపుతో మూడు స్థానాల్లో మాత్రమే ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జీహెచ్‌ఎంసీలో పార్టీల బలాలు మారాయి.
● బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 24గా ఉంది. మరోవైపు గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్–ఎంఐఎం మైత్రీ బంధం కొనసాగినప్పటికీ, ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటోంది. పలు సందర్భాల్లోనూ ఆ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఈసారి బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అవకాశాలుండవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య, బడ్జెట్ సమావేశంలో ఈ అంశం వెల్లడైంది.
● సభలో గందరగోళం జరపుతూ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ సభ్యులందరినీ మార్షల్స్‌తో సభ నుంచి బయటకు పంపాక సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలో ఏయే పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయి.. ఏవి మద్దతిస్తాయి.. ? ఎవరు ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో గడువు ముగియనున్న స్టాండింగ్ కమిటీలో బీఆర్‌ఎస్ నుంచి ఎనిమిది మంది, ఎంఐఎం నుంచి ఏడుగురుండగా, ఎంఐఎం సభ్యుల్లోని ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్‌బేగం మృతి చెందడంతో ఆ సీటు ఖాళీగానే ఉంది.
నేడు నోటిఫికేషన్
Comments
Please login to add a commentAdd a comment