అంబులెన్సులో రెండు సుఖప్రసవాలు
కందుకూరు: మూడు గంటల వ్యవధిలో ఒకే 108 అంబులెన్స్ సిబ్బంది ఇద్దరు గర్భిణులకు సుఖప్రసవం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నేదునూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నలినిబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. రెండో కాన్పు నిమిత్తం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో 108కి సమాచారం అందించారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఈఎంటీ రాయుడు, ఫైలట్ యాదయ్య ఆమెకు సుఖప్రసవం చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డను మహేశ్వరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు.
రాత్రి 2గంటలకు..
అదే రాత్రి 2 గంటల సమయంలో మండల పరిధి లేమూరుకు చెందిన సంధ్యకు పురిటినొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న రాయుడు, యాదయ్య ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవడంతో వాహనంలో ప్రసవం చేశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డను శంషాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఈ రెండు కేసుల్లో సమయానికి ప్రసవం చేసిన సిబ్బందిని మహిళల కుటుంబీకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment