గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం భూ సేకరణ
యాచారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఆందో ళనలు అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. గట్టిగా మందలిస్తే సర్కార్ పెద్దల నుంచి ఏం మాటొస్తుందోననే భయం.. ఊరుకుంటే ఎటు దారి తీస్తుందోననే కలవరంతో కంటికి కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా స్థానిక రైతులు, ప్రజల పక్షాన పోరాడకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న అధికార పార్టీలోని కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకారులకు అండగా స్వరం వినిపిస్తున్నారు.
పెట్టుబడులపై నజర్
ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా సర్కార్ దృష్టి పెట్టింది. ఆ దిశగా రోడ్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి 330 అడుగుల ఎలివేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో 1,004.22 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దాదాపు 42 కిలోమీటర్ల మేర విస్తరించనున్న రోడ్డు నిర్మాణంతో 4,725 మంది రైతుల తమ వ్యవసాయ భూములు కోల్పోనున్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని పది గ్రామాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించారు. 13,500 ఎకరాలు సేకరించారు. ఇంకా 5,833 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5,833 ఎకరాలతో పాటు మరో 10 వేల ఎకరాల భూములను ఫ్యూచర్ సిటీ కోసం సేకరించాలని సంకల్పించింది.
కాంగ్రెస్ నేతల మద్దతు
ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు, మహేశ్వరం మండలాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సర్వే పనులను ఆయా గ్రామాల్లో అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మార్కింగ్ వేశారు. యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా 2,200 ఎకరాల పట్టా భూముల రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేసింది. 2,200 ఎకరాల పట్టా భూములను మళ్లీ తమ పేర్లపై మార్చా లని రైతులు ఆందోళనలు, ధర్నాలకు దిగుతు న్నారు. పట్టా రైతులకు మద్దతుగా ఆయా గ్రామా ల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కీలక నేతలే నాయకత్వం వహిస్తుండడం విశేషం. గ్రీన్ ఫీల్డ్‌రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు మద్దతుగా ఉంటున్నారు. దీంతో అధికారులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.
ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న రైతులు
ఆందోళనకారులకు అధికార పార్టీ నేతల మద్దతు
తర్జనభర్జనలో అధికార యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment