వేలిముద్రలు నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేలిముద్రలు నమోదు చేసుకోవాలి

Published Thu, Sep 14 2023 7:16 AM | Last Updated on Thu, Sep 14 2023 7:16 AM

నాయకులకు కండువాలు వేస్తున్న
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌  - Sakshi

నాయకులకు కండువాలు వేస్తున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

సంగారెడ్డి టౌన్‌: రేషన్‌ కార్డులో పేర్లు ప్రతి ఒక్కరూ వారి వేలిముద్రలను షాపు ల్లోని ఈ పాస్‌ యంత్రం ద్వారా ధ్రువీకరించుకోవాలని అదనపు కలెక్టర్‌ మాధురి బుధవారం సూచించారు. రేషన్‌ పంపిణీ పూర్తయిన తర్వాత కూడా దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఆ మేరకు రేషన్‌ దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

రాయికోడ్‌(అందోల్‌): సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అందేలా చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. రాయిపల్లి, నాగ్వార్‌, బొగ్గులంపల్లి గ్రామాలకు చెందిన పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఇందూర్‌ గ్రామ సమీపంలోని ఆశ్రమాన్ని దర్శించుకోగా ఆశ్రమాధిపతి చెల్లమల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందారు. ఇటికేపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మించే హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున్‌పాటిల్‌, పార్టీ మండల అధ్యక్షుడు బసవరాజ్‌పాటిల్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సిద్ధప్ప పాటిల్‌, నాయకులు విఠల్‌, తుకారం, శంకర్‌,లక్ష్మణ్‌, అడివయ్య, మల్లు పాటిల్‌, బస్వరాజ్‌ పాటిల్‌, మాణిక్యం, తదితరులు ఉన్నారు.

ఎర్థనూర్‌ గుట్టల్లో

చిరుత సంచారం!

కంది(సంగారెడ్డి): మండలపరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్థనూర్‌ బ్యాతోల్‌ శివారులో కంకర క్రషర్‌లో పనిచేసే ఓ కార్మికుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు గుట్టలవైపు వెళ్లాడు. అక్కడ అతడికి చిరుత కనిపించడంతో భయంతో పరుగు తీసి, తోటి కార్మికులతోపాటు గ్రామస్తులకు ఈ విషయమై తెలిపాడు. గుట్టల పక్కనే ఉన్న బ్యాతోల్‌ తండా, ఎర్థనూర్‌ తండా, ఎర్థనూర్‌ గ్రామస్తులకూ తెలిసింది. దీంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

జిన్నారం(పటాన్‌చెరు): మండలంలోని గడ్డపోతారం గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌ను ఈఓ నరేశ్‌ ఆధ్వర్యంలో బుధవారం జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు. రెండేళ్ల క్రితం నిర్మించగా ఇప్పుడు కూల్చివేయటం ఏంటని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నిర్మాణాలు లేకున్నా ఇంటి నంబర్లను కూడా అధికారులు కేటాయించారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశమై పలు అవకతవకలు జరిగి నట్లు ఆరోపిస్తూ నేతలు డీపీఓకు ఫిర్యాదు చేశారు.

డీఎల్‌పీఓ విచారణ

గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని 72, 80, 84, 85, 89 సర్వే నంబర్‌గల భూమి లో ఇంటి నంబర్లు కేటాయించారనే ఆరోపణలపై డీఎల్‌పీఓ సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈఓ నరేశ్‌బాబు, ఇతర సిబ్బందితో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత అక్రమాలకు ఎవరు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

‘ఎన్నికల్లో గౌడ సంఘానిది కీలక పాత్ర’

సదాశివపేట(సంగారెడ్డి): త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర గౌడ సంఘం అత్యంత కీలకం కానుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటేల్‌ వెంకటేశం గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన సంఘం సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలో జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి సంఘం పెద్దలను, యువకులను కలసి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని వెల్లడించారు. గౌడ కులస్తులు ఐకమత్యంతో ఉండాలని, సమస్యల పరిష్కారానికి కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.

జిల్లా కమిటీ ఇదే

సంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా బుదేరా పెద్దాగౌడ్‌, ప్రధాన కార్యదర్శి బండల వెంకటేశంగౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడిగా పోగుల జగన్‌గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement