కోరమీసాల స్వామి..
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామి మమ్మేలు.. కోరమీసాల స్వామి దీవించు.. అంటూ భక్త జనం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. కొమురవెల్లి మల్లన్న క్షేత్రం భక్తజనసంద్రమైంది. ఆదివారం స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచే స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నగరానికి చెందిన వేలాది మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
బోనాలతో బారులు..
అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు, యువతులు తరలివచ్చారు. ఆలయ వీధులన్నీ బోనాలతో నిండిపోయాయి. స్వామికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
దారులన్నీ కొమురవెల్లికే ...
ఎటుచూసినా భక్తజనమే కనిపించింది. దారులన్నీ కొరుమవెల్లికే దారితీశాయి. రాష్ట్రంలోని పలు జిల్లానుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయానికి చేరుకునే రహదారుల్లో 2 కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు భక్తుల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకున్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. పట్నం వారం అనంతరం హైదరాబాద్‌కు చెందిన భక్తుడు మాణిక్యం పోచయ్య వంశస్తులు పెద్దపట్నం రచించి, అగ్నిగుండాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ తోట బావి ప్రాంగణంలో పెద్ద పట్నం, అగ్నిగుండాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు పెద్దపట్నం,
అగ్నిగుండాలు
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రం
వైభవంగా బ్రహ్మోత్సవాలు షురూ
పట్నం వారానికి పోటెత్తిన భాగ్యనగర వాసులు
మల్లన్న నామంతో పులకించిన శైవక్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment