నాన్న ఫ్రెండ్ సలహాతోనే..
సాక్షి, సిద్దిపేట : మా నాన్న స్నేహితుడు ఒకరు రైల్‌లో కలిసినప్పుడు మీ అబ్బాయిని అగ్రికల్చర్ చేయించు అని సలహా ఇచ్చారు. ఆయన సలహా, సూచనలతోనే అగ్రికల్చర్ బీఎస్సీ వైపు అడుగులు వేశాను.. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఉపకులపతి స్థాయికి ఎదిగానంటున్నారు డాక్టర్ దండ రాజిరెడ్డి. ఇప్పటి వరకు 130 వరకు రిసెర్చ్ పేపర్‌లు పబ్లిష్ అయ్యాయి. ఉద్యాన రైతుల అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇటీవల సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆయన్ను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో వీసీగా ఎదిగిన తీరును ‘సాక్షి’తో పంచుకున్నారు.
డాక్టర్ చదవాలనుకున్నా
మా గ్రామంలో 8వ తరగతి వరకే ప్రభుత్వ పాఠశాల ఉంది. దీంతో మెరుగైన విద్య కోసం హన్మకొండలో చదువుకునేందుకు మా నాన్న పంపించారు. అక్కడే 9వ తరగతి మల్టీపర్పస్ ప్రభుత్వ పాఠశాలలో, 10వ తరగతి మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదివాను. డాక్టర్ చదువాలనుకున్నా మెడిసిన్‌లో సీటు రాలేదు. దీంతో మహారాష్ట్రలో అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ (వ్యవసాయశాస్త్రం) పూర్తి చేశాను. చదువు పూర్తి కాగానే ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 1983 సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయ వాతావరణ శాస్త్రంలో పీహెచ్‌డీని గుజరాత్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేశాను. 1993 వరకు నాన్నతో కలిసి వ్యవసాయం చేశాను.
ట్రైన్‌లో చెప్పిన ఆ మాటలే..
నాకు డాక్టర్ కావాలని ఉండేది.. ఎంబీబీఎస్ సీటు రాలేదు.. ఒక రోజు నాన్న ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా... నాన్నకు తన ఫ్రెండ్ కలిశారు. పిల్లలు ఏమి చదువుతున్నారు.. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న క్రమంలో నా గురించి నాన్న ఆయన ఫ్రెండ్‌కు చెప్పారు. అగ్రికల్చర్ బీఎస్సీ చేపించండి అని సలహా ఇచ్చారు. దీంతో నాన్న అగ్రికల్చర్ బీఎస్సీ ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. మహారాష్ట్రలో ఉందని తెలిసి అన్ని వివరాలు కనుక్కొని నన్ను అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ చేపించారు. ఆ రోజు మా నాన్నకు ఆ అంకుల్ కలవకపోతే సాధారణంగా బీఎస్సీ మాత్రమే చేసేవాడిని.. ఆ అంకుల్ చెప్పడంతోనే అగ్రికల్చర్ విద్య వైపు వ చ్చాను. ఇప్పుడు రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నా.
రైతు మేళాలు నిర్వహిస్తా
ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పండ్లు, కాయగూరలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, పోస్ట్ హార్వెస్టింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెడతాం. ఉద్యాన పంటలు సాగు చేసే రైతుకి, వినియోగదారుడికి ధరలో వ్యత్యాసం ఉంటుంది, ఆ ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉందని తెలుసుకొని ఏ మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉంటుందో అక్కడ విక్రయించుకుంటే లాభం వస్తుంది. అలాగే ఉద్యాన పంట ఉత్పత్తులకు జియో ట్యాగ్ వచ్చే విధంగా కృషి చేస్తాను. రైతు మేళాలు నిర్వహిస్తా, రైతులకు సాగులో నూతన టెక్నాలజీ అందించే విధంగా ముందుకు సాగుతాం.
1998 నుంచి 2013 వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల పై రైతులకు అవగాహన సదస్సులు ద్వారా పలు సూచనలు, సలహాలు ఇచ్చాను. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో టీవీల ద్వారా రైతులు అడిగి ప్రశ్నలకు సూచనలు చేశాను. 2014లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్, 2017లో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ విధులు నిర్వర్తిస్తూ అక్టోబర్, 2019 ఉద్యోగ విరమణ పొందాను. రెండేళ్లపాటు వరల్డ్ బ్యాంక్ తరఫున ఆఫ్ఘనిస్తాన్‌కు వాతావరణ మార్పుల సలహాలు ఇచ్చాను. నా అనుభవాన్ని చూసి ప్రభుత్వం ఉప కులపతిగా నియమించింది.
కుటుంబ నేపథ్యం
మాది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్‌పూర్ మండలం కునారం గ్రామం. దండ రాంరెడ్డి–సుభద్రలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. నాన్న ప్రభుత్వ టీచర్‌గా పని చేసేవారు.. అయినప్పటికీ వ్యవసాయం చేసేవారు. నాకు 1982లో సూర్యకుమారితో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు.
టీవీల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు
అగ్రికల్చర్ వైపు అడుగులు వేశా
డాక్టర్ కావాలనుకున్నా సీటు రాలేదు
1983లో రిసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం
2019లో ఉద్యోగ విరమణ
వాతావరణ మార్పులపై రైతులకు సలహాలు, సూచనలు
130 రిసెర్చ్ పేపర్‌లు పబ్లిష్
‘సాక్షి’తో ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment