ప్రాణాలు తీసిన రాంగ్ రూట్
కారు, మోటార్‌సైకిల్ ఢీకొని యువకుడు మృతి
నారాయణఖేడ్: రాంగ్ రూట్ ప్రయాణం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. కారు, మోటార్‌సైకిల్ ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రం సమీపంలో కేఎన్‌ఆర్ కార్యాలయం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ రక్కసిపేటకు చెందిన గోపికుమార్(30) మోటార్ సైకిల్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. ఎకై ్సజ్ ఎస్‌ఐగా పని చేస్తున్న విజయ్ కారులో జోగిపేట నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనగా గోపికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాంగ్‌రూట్‌లో వచ్చి తన కారును ఢీకొట్టి మృతి చెందాడని విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఖేడ్ ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.
రెండు బైక్‌లు ఢీ : ఒకరు మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన గజం కిషన్(60) బైక్‌పై చిన్నశంకరంపేట వైపు వెళ్తున్నాడు. ఇదే సమయంలో చిన్నశంకరంపేట వైపు నుంచి సూరారం వైపు చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన రమేశ్ బైక్ పై వస్తున్నాడు. మార్గమధ్యలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్తులు 108 అంబులెన్స్ ద్వారా మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కిషన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
లారీకి విద్యుత్ వైర్లు తగిలి ఆపరేటర్..
మనోహరాబాద్(తూప్రాన్): లారీకి విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం, గర్వ జిల్లాకు చెందిన జితేంద్ర ప్రజాపతి (23) నాలుగు నెలల కిందట హిటాచీ ఆపరేటర్‌గా పని చేయడానికి మండలంలోని కూచారం గ్రామానికి వచ్చాడు. గురువారం రాత్రి లారీపై హిటాచీని ఎక్కించి పోతారం మీదుగా శివ్వంపేట మండలానికి వెళ్తున్నారు. పోతారం గ్రా మంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు హిటాచీకి తగిలాయి. దీంతో లారీని ఆపారు. విద్యు త్ వైర్లను తొలగించడానికి కిందికి దిగిన ఆపరేటర్ జితేంద్ర కింద బురదలో నిలబడి లారీని పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘనపై బంధువు ఉజ్గార్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని తాజా మాజీ సర్పంచ్ మాధవరెడ్డి ఆరోపించారు.
ఆటోను ఢీకొట్టిన ఎక్సెల్
అల్లాదుర్గం(మెదక్): ఆటోను టీవీఎస్ ఎక్సెల్ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ దిబ్బ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ రెడ్డి కథనం మేరకు.. పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో రేగోడు మండలం ఇటిక్యాల గ్రామానికి వరి కోతలకు వచ్చారు. తిరిగి ఇటిక్యాల గ్రామం నుంచి ముద్దాపురం వెళ్తుండగా బహిరాన్ దిబ్బ శివారులోకి రాగానే ఎదురుగా ఎక్సెల్ వాహనం వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని సంగయ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎక్సెల్ నడుపుతున్న పాండుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ భాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్..
శంకర్‌పల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (40) కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి బాలరాజు 12 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లగా.. తల్లి లక్ష్మి రెండేళ్ల కిందట మరణించింది. అన్న ఆంజనేయులు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కార్పెంటర్ దుకాణం నిర్వహిస్తుండగా శేఖర్ అక్కడే పని చేసేవాడు. నాలుగు రోజుల కిందట తల్లి సంవత్సరీకం ఉందని పటాన్‌చెరులో ఉండే అక్క కల్పన ఇంటికొచ్చాడు. అక్కడ నుంచి శంకర్‌పల్లికి వచ్చి పట్టణ శివారులో శవమై తేలాడు. శుక్రవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం తాగి, బహిరంగ మలవిసర్జనకు వచ్చిన క్రమంలో ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment