గ్రూప్–3 పరీక్షకు సర్వం సిద్ధం
జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
● పరీక్ష రాయనున్న 15,163 అభ్యర్థులు ● అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ● అరగంట ముందే కేంద్రాలగేట్లు మూసివేత
సంగారెడ్డి జోన్: జిల్లాలో గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న గ్రూప్– 3 పరీక్ష ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,123 అభ్యర్థులు హాజరు కానుండగా జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపుకార్డులను పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం మీడియాకు తెలిపారు.
రెండు రోజులపాటు గ్రూప్3 పరీక్ష
ఈనెల 17 న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్– 2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు. 18న ఉదయం 10.00 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష జరగనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్‌ఎం, మందులను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆయారూట్లలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాలను 9 రూట్లుగా విభజించినట్లు ఒక్కో రూటుకు ఒక్కో జాయింట్ రూట్ ఆఫీసర్ లు నియమించినట్లు వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక డిపార్ట్‌మెంట్ అధికారి, 119 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 157 మంది గుర్తింపు అధికారులు, 15 ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఇతరసిబ్బంది 34 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు, సలహాలు
అభ్యర్థులు నలుపు /నీలం బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో ఉన్న గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలి.
సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలన్నారు. మొబైల్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్‌తోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment