భలే బేలర్..
హార్వెస్టర్‌తో వరి కోతలు.. బేలర్‌తో గడ్డికట్టలు కట్టడం
● బేలర్ యంత్రంపై ఆసక్తి చూపుతున్న రైతులు
● ఈ ఏడాది వరి గడ్డికి భలే డిమాండ్
● కట్టకు రూ.30 నుంచి 35 వసూలు
దుబ్బాకటౌన్: కాలం మారేకొద్దీ వ్యవసాయంలో యాంత్రీకరణ వినియోగం పెరుగుతుండటమేకాదు ఏకంగా శాసిస్తోంది కూడా. ఒకప్పుడు వరి కోతలు కొడవళ్లతో కోసేవారు. రాను రాను హార్వెస్టర్లు రావడంతో కొడవళ్లతో కోతలు కనుమరుగయ్యాయి. హార్వెస్టర్‌తో కోసిన వరి పొలాల్లో గడ్డి తక్కువగా రావడంతోపాటు పొలంలో పడి వృథాగా మారుతుంది. దీంతో రైతులు పొలాల్లో వృథాగా పడి ఉన్న గడ్డిని కాల్చేస్తున్నారు. దీంతో డెయిరీ ఫారం నిర్వాహకులకు, పాల వ్యాపారంపై ఆధారపడుతున్న రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు బేలర్ యంత్రాలతో గడ్డిని కట్టలుగా కట్టించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కట్టలు కట్టిన గడ్డిని తెచ్చుకుంటూ..పశుగ్రాసం కొరత తీర్చుకుంటున్నారు.
ఒక్కో కట్టకు రూ.30–35
వరిగడ్డి కట్టే బేలర్ యంత్రాలు ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. హార్వెస్టర్ కోసినప్పుడు పొలంమంతా పడిన గడ్డిని బేలర్ యంత్రం కట్టలు కడుతుంది. ఎకరం పొలంలోని గడ్డిని గంటలోపే దాదాపు 40 నుంచి 45 కట్టలు కడుతుంది. ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35 తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పెంచే రైతులు పొలంలోని గడ్డిని తీసుకెళ్లేందుకు ముందుగా రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి యంత్రంతో కట్టలు కట్టిస్తున్నారు. గడ్డికి సైతం డబ్బులు వస్తుండటంతో చాలామంది రైతులు గడ్డిని కాల్చకుండా వదిలేస్తున్నారు. సాధారణంగా మూడు నాలుగు నెలల పాటు పశుగ్రాసం వచ్చేలా రైతులు నిల్వ చేస్తుంటారు.
అకాల వర్షాలతో.. వరి గడ్డికి భలే డిమాండ్
అకాల వర్షాలతో రైతులు వరి కోయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చైన్ మెషీన్లు దొరకక వరి కోతలకు నానాతంటాలు పడ్డారు. వర్షాలతో చైన్ మెషీన్లు వరి కోయడం వలన ఈసారి ఎండుగడ్డిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వరి గడ్డికి డిమాండ్ పెరిగింది. నాలుగు నెలల వరకు గడ్డి దొరికే అవకాశం లేకపోవడంతో ఆవులు, గేదెల ఫారాల రైతులు గడ్డిని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఎకరాకు రూ.2 నుంచి 3 వేల వరకు గడ్డి కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో గడ్డికి డిమాండ్ ఏర్పడుతుంది.
గడ్డిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు
బేలర్ యంత్రాలు రాకముందు గడ్డి వాము పెట్టాలంటే రోజుకు ఒక్క కూలీకి రూ.600 నుంచి 7 వందల వరకు చెల్లించే వాళ్లం. బేలర్ యంత్రాలతో కట్టలు కట్టించడం వల్ల కూలీల ఖర్చు మిగలడమే కాకుండా సమయం వృథా కావడం లేదు. కట్టలు కట్టించడంతో గడ్డి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
– భాస్కర్, రైతు, దుబ్బాక
Comments
Please login to add a commentAdd a comment