రెక్కాడక.. పూట గడవక
జగదేవ్‌పూర్ (గజ్వేల్): రెక్కాడితే కానీ పూట గడవని నిరుపేద కుటుంబం.. కనీసం తల దాచుకోవడానికి గూడు లేని దుస్థితి.. నాలుగు గుంజల పందిరే దిక్కు... కష్టం చేద్దామన్నా సహకరించని ఆరోగ్యం.. దీంతో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండలంలో తిగుల్ గ్రామానికి చెందిన మన్నె శ్రీనివాస్ గత పదిహేనేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు. ప్రస్తుతం స్థానిక పాఠశాలలోనే పదో తరగతి చదువుతోంది. గ్రామంలోనే ఓ పూరిగుడిసెలోనే ఉంటూ కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం భార్య జ్యోతి తీవ్ర అనారోగ్యం బారిన పడింది. భార్యను వైద్య నిమిత్తం ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఆమె ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన భార్యను చూసుకోవడంతోపాటు కుటుంబ పోషణకూడా శ్రీనివాస్ చూసుకుంటుండటంతో జీవనం కష్టమైపోయింది. వీటికితోడు వీరు నివసించే గుడిసె కూడా ఇటీవలే కూలిపోయింది. మరో గూడు ఏర్పాటుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నాలుగు గుంజల పందిరి కిందనే కుటుంబం మొత్తం తలదాచుకుంటున్నారు. చుట్టూ కనీసం కవరు కూడా లేకపోవడం వల్ల చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కూడా కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేకపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం, మానవతావాదులు స్పందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిరుపేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
నీడ కల్పించాలి..
భార్య అనారోగ్యంతో మంచాన పడింది. కనీసం ఉండేందుకు కూడా ఇల్లు లేదు. గూడు కల్పించి సరైన వైద్యం అందిస్తే మేలు. పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –శ్రీనివాస్. తిగుల్
● పస్తులుంటున్న నిరుపేద కుటుంబం
● నాలుగు గుంజల పందిరే నివాసం
● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
Comments
Please login to add a commentAdd a comment