జోరుగా పత్తి కొనుగోళ్లు
రాయికోడ్(అందోల్): పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారుల బారిన పడి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. జిల్లాలోని రాయికోడ్, మునిపల్లి, నారాయణఖేడ్, సదాశివపేట, వట్‌పల్లి, జోగిపేట తదితర మండలాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో 22 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 7,521 నిర్ణయించారు. అయితే 8 శాతం వరకు తేమ ఉన్న పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. 8కి మించితే ధరలో కోత విధిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో భాగంగా జిల్లాలో రైతులు 3.60 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పది రోజుల క్రితం సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. 22 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 98,487 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతుల వద్ద అప్పటికీ ఇంకా పత్తి నిల్వ ఉంటే మరికొన్ని రోజులు కేంద్రాలను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో 22 సీసీఐ కేంద్రాల ఏర్పాటు
పది రోజుల్లో 98,487 క్వింటాళ్ల కొనుగోలు
మద్దతు ధర రూ.7,521 చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment