సుందరీకరణకు బ్రేక్!
చొరవ చూపని నేతలు
గజ్వేల్: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోవడం, మరికొన్ని ప్రారంభానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అభివృద్ధికి నమూనాగా ఊదరగొట్టిన నేతలు ప్రస్తుతం మిన్నకుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రత్యేకించి పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టాలనుకున్న.. ఎనిమిది జంక్షన్ల అభివృద్ధి పనుల పెండింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రెండున్నరేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించింది. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే.
కూడళ్లను సుందరీకరించేందుకు..
పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్‌రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సర్కిల్, ముట్రాజ్‌పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిద్దిడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్‌రామ్ చౌరస్తా, ముట్రాజ్‌పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేశారు. మిగతా చోట్ల పనుల ఊసే లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్కు చౌరస్తాలో జంక్షన్‌ను అభివృద్ధి చేయాలంటే ప్రస్తుతమున్న చౌరస్తాను విస్తరించాల్సి ఉంటుంది. దీని ద్వారా జంక్షన్‌కు మరింత శోభ చేకూరే అవకాశముంది. కానీ విస్తరణలో కొన్ని ముఖ్యమైన భవనాలను కొంత భాగం కట్ చేయాల్సి వస్తుందనే భావనతో ఈ ప్రతిపాదన ముందుకు సాగడం లేదని తెలుస్తున్నది.
ఇందిరాపార్కు కూడలి కీలకం..
మున్సిపాలిటీకి ఇందిరాపార్కు కూడలి అత్యంత కీలకమైనది. ఇక్కడ జంక్షన్ అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్లవుతుంది. అంతేకాకుండా ఈ జంక్షన్ పట్టణానికి తలమాణికంగా నిలవనుంది. కానీ ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదు. అదేవిధంగా ఐఓసీ వద్ద కూ డా జంక్షన్ అభివృద్ధి చేయాల్సి ఉండగా...ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. దీంతో ఈ ప్రదేశంలో పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు.
గజ్వేల్ పట్టణంలో
సుందరీకరించాల్సిన
ఇందిరాపార్కు జంక్షన్ ఇదే
‘లవ్ జీపీపీ’ అంతేనా?
గజ్వేల్ మున్సిపాలిటీలో నిలిచిన ప్రగతి
ఎనిమిది జంక్షన్లలో మూడు మాత్రమే పురోగతి
రూ.2కోట్ల నిధులున్నా పనులు సగమే..
ప్రతిపాదనల్లో మరిన్ని నిర్మాణాలు
రెండు నెలల్లో పాలకవర్గం పదవీ కాలం పూర్తి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణ పనులకు బ్రేక్ పడింది. పట్టణంలోని ఎనిమిది జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కేవలం మూడింటిని మాత్రమే అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. రూ.2కోట్ల నిధులున్నా పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల్లో మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం కూడా ముగియనుంది. అయినా ఈ పనులపై ఏమాత్రం పట్టింపులేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఇకపోతే ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద ‘లవ్ జీపీపీ’ పేరుతో ఏర్పాటు చేయాలనుకున్న స్వాగత ద్వారం పనులు పెండింగ్‌లో పడ్డాయి. కాగా పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తాల సుందరీకరణ కూడా ముందుకుసాగటం లేదు. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం సైతం మరో రెండు నెలల్లో ముగియనుండగా.. ఈ పనులపై ఇప్పటికీ కనీస పట్టింపులేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనులు వేగిరం చేస్తాం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జంక్షన్‌ల అభివృద్ది పనులు పెండింగ్‌లో పడిన మాట వాస్తవమే. ఐఓసీ వద్ద కోర్టు కేసు కారణంగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందిరాపార్కు చౌరస్తా వద్ద అందరి సహకారంతో పనులు సాగేలా ప్రయత్నిస్తాం. మిగతా చోట్ల కూడా పరిశీలన జరుపుతాం.
– గొల్కొండ నర్సయ్య,
మున్సిపల్ కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్
Comments
Please login to add a commentAdd a comment