పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తిరుపతి
దుబ్బాక: పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దుబ్బాక పట్టణానికి చెందిన గాజుల తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. నేతన్నలకు కుల వృత్తిలో తగిన ఉపాధి కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నమ్మకంతో తనకు పదవీబాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి
పోరాటం
బెజ్జంకి(సిద్దిపేట): ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సీపీఎం మూడో మహాసభ ఆదివారం బెజ్జంకిలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది సీపీఎం పార్టీయేనని అన్నారు. పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాల్లబండి శశిధర్, మండల కార్యదర్శి శ్రీనివాస్, దాసరి ప్రశాంత్, బొమ్మిడి సాయికృష్ణ, ఎల్లయ్య, లింగం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిహారం ఇవ్వడంలేదని..
మహిళ ఆత్మహత్యాయత్నం
దుబ్బాకరూరల్: భూమికి సంబంధించిన పరిహారం డబ్బులు రాక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మండలంలోని కమ్మర్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోడ మల్లవ్వకు ఎకరం భూమి ఉంది. మల్లన్న సాగర్ ఉప కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయింది. పలుమారు అధికారులు పరిహారం డబ్బులు చెల్లించాలని వేడుకుంది. ఎవరూ స్పందించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అధికారులపై
వేధింపులు ఆపాలి
జహీరాబాద్ టౌన్: సమగ్ర కులగణన సర్వే చేస్తున్న ఉపాధ్యాయులపై అధికారుల వేధింపులను నిలిపివేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ (ఎస్‌జీటీయూ) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా 150–180 వరకు గృహాల సర్వే చేయాలంటూ ఆదేశాలున్నాయన్నారు. కానీ అంతకన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల సర్వే సకాలంలో పూర్తి కావడం లేదన్నారు. ఈ విధులు నిర్వహిస్తున్న టీచర్ల పట్ల మండల అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. న్యాల్‌కల్ మండలం చాల్కి ప్రభుత్వ పాఠశాలో పని చేస్తున్న టీచర్ శంకర్‌ను మండల ఎంపీఓ సురేశ్ దూషించారన్నారు. సర్వే ఫారాల కోసం శంకర్ ఎంపీఓ ఇంటికి వెళ్లినందుకు స్కూల్‌కు వచ్చి అసభ్యంగా తిట్టారన్నారు. వెంటనే ఈ విషయమై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామన్నారు. ఉపాధ్యాయుడి పట్ల దురుసుగా వ్యవహరించిన ఎంపీఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనట్లయితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment