ఎన్నాళ్లీ యాతన
● నత్తనడకన జాతీయ రహదారి పనులు
● ముందుకు సాగని మెదక్– సిద్దిపేట–
ఎల్కతుర్తి రహదారి నిర్మాణం
● వాహనదారులకు తప్పని తిప్పలు
● త్వరగా పూర్తిచేయాలంటూ వినతులు
మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు ఇలాగే సాగితే మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పనులు త్వరగా పూర్తిచేసేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి (765డీజీ) జాతీయ రహదారి పనులను 2022లో వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 133.61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.1,461కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు రెండు ప్యాకేజీలుగా జాతీయ రహదారుల శాఖ విభజించింది. అందులో మొదటి ప్యాకేజీ మెదక్ నుంచి సిద్దిపేట.. 69.97కిలో మీటర్లకు రూ.882కోట్లు, రెండో ప్యాకేజీ సిద్దిపేట నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్లకు రూ.579 కోట్లను కేటాయించారు.
ఏడాదిన్నరగా సాగుతున్న పనులు
రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల దగ్గర 8 నుంచి 10మీటర్ల వెడల్పుతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. పందిళ్ల సమీపంలో టోల్ ప్లాజా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన 400 ఫీట్ల వెడల్పు స్థల సేకరణ ఇంకా చేపట్టలేదు. అలాగే ఆరెపల్లి నుంచి కోహెడ వరకు 1.3 కిలో మీటర్లు రోడ్డు ఎక్కువగా మలుపులున్నాయి. ఎలాంటి మలుపులు లేకుండా చేసేందుకు ఇంకా స్థల సేకరణ చేపట్టాలి. అలాగే హుస్నాబాద్ పట్టణంలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయడంతో అది కోట్టుకపోయి వాహనాల రాకపోకలు వారం రోజుల పాటు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు రాకపోకలు సాగిస్తుంటే విపరీతంగా దుమ్ము లేస్తుండటంతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పనులు నెమ్మదిగా సాగుతుండటంతో మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.
పలువురు మృత్యువాత
రోడ్డు విస్తరణ సందర్భంగా నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసిన గుంతలవద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొందరు మృత్యువాత, మరికొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.
మార్చిలోగా పూర్తిచేస్తాం
మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి రోడ్డు పనులు మార్చిలోగా పూర్తయ్యేందకు కృషి చేస్తాం. క్రాసింగ్‌లు లేకుండా ఉండేందుకు, టోల్‌ప్లాజా కోసం కొంత స్థల సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ఆలస్యం కాకుండా చూస్తాం
–కృష్ణారెడ్డి, ఈఈ, జాతీయ రహదారులు
Comments
Please login to add a commentAdd a comment