చేతులెత్తేసిన.. చేపల కాంట్రాక్టర్లు
టెండర్లకు స్పందన కరువు
● మూడుసార్లు గడువు పొడిగించినా
స్పందన నిల్
● 1,715 చెరువుల్లో 2.21కోట్ల
చేపపిల్లల పంపిణీకి నిర్ణయం
● నగదు ఇస్తేనే మేలంటున్న మత్స్యకారులు
మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఒక్కొక్కరుగా చేతులెత్తేస్తుండటమే ఇందుకు కారణం. గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సైతం 1,715 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు 2.21కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గత నెలలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మధ్యలోనే కాంట్రాక్టర్లు చేప పిల్లలు పంపిణీ చేయలేం అని వెళ్లిపోతున్నారు. ఇదిలాఉంటే చేప పిల్లలకు బదులుగా నగదును అందజేయాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు.
నగదు ఇవ్వాలి
చేప పిల్లలు వదిలేందుకు అదను దాటిపోయిందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. తమ సొంత డబ్బులతో ప్రైవేట్ ఫిష్ ఫాంలో కొనుగోలు చేసి పెంచుతున్నామని తెలిపారు. ప్రతి ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే చేప పిల్లల పంపిణీ పూర్తయ్యేది. నవంబర్ 19వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు పంపిణీ ఐదు శాతం మాత్రమే జరిగింది. సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని పంపిణీ చేయని చెరువులకు సంబంధించి నగదును సొసైటీలకు అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఇంకా 2.08 కోట్ల చేప పిల్లలు..
గత ఏడాది 4.41కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సారి ప్రభుత్వం కోత పెట్టి 2.21కోట్ల చేప పిల్లలు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో 35 నుంచి 40ఎంఎం చేప పిల్లలు 84.35లక్షలు, 80 నుంచి 100ఎంఎం 1,31,92,000 పంపిణీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు 25 చెరువుల్లో 12.34లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. ఇంకా సుమారుగా 2.08 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment