అప్పుడు గౌరవెల్లి .. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ
● మరోసారి భూములను కోల్పోతున్నాం ● పచ్చని పొలాల్లోంచి కాలువ తీయొద్దు ● ఇటీవలే రూ.35 లక్షలకు కొన్నాం ● గ్రామసభలో రైతులు
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోగా ఏడాది క్రితం ఐదారు భూనిర్వాసిత కుటుంబాలు కట్కూర్‌లో దాదాపు రూ.30 నుంచి 35 లక్షలు వెచ్చించి భూములు కొనుగోలు చేశామని, ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణం తాము కొనుగోలు చేసిన పచ్చని పంటపొలంలోంచి తీస్తామన్నడంతో మరోసారి కోల్పోతున్నామని బాధిత రైతులు అన్నారు. అక్కన్నపేట మండలం కట్కూర్ లో డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణ భూ సేకరణపై శనివారం గ్రామసభను నిర్వహించగా ఆర్డీఓ రామ్మూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడారు తమకు దురదృష్టం వెంటాడుతుందా? గౌరవెల్లిలో సర్వం కోల్పోవడంతో ఇక్కడ భూములు కొనుగోలు చేసుకొని బతుకున్నామని, ఇప్పడు డిస్ట్రిబ్యూటరీ కాలువ ఏకంగా జీవనాధారంగా ఉన్న పచ్చని పొలంలోంచి తీస్తామంటే ఎలా ఉండేదని చెప్పారు. తాము కొనుగోలుకు వెచ్చించినంతా డబ్బులు కూడా ఇవ్వరని, తమను మళ్లీ ముంచవద్దని చేతులేత్తి గ్రామసభలో వేడుకున్నారు. నష్టపరిహారం రూ.40లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
న్యాయం జరిగేలా చూస్తాం
మరోసారి భూములు కోల్పోతున్న గౌరవెల్లి భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లుతామని ఆర్డీఓ రామ్మూర్తి అన్నారు. భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేమన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి 2010లోని డిజైన్‌లు తయారైందన్నారు. కాలువల నిర్మాణ డిజైన్‌ను మార్చే అవకాశం ఉండదన్నారు. రైతులందరూ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈ కరుణ శ్రీ, ఎంపీడీఓ భానోతు జయరాం, ఆర్‌ఐ యాదగిరి, పంచాయితీ కార్యదర్శి స్వరూప, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment