జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీ
● అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం ● వంట రుచి చూసేందుకు అధికారిని కూడా ● కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ, గురుకులాలు, మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రభుత్వ దవాఖానాలలో మంచి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లాలోని విద్య, సోషల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్, సివిల్ సప్లయ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో ఆహారం అందించే ప్రతి విద్యాసంస్థలలో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని మాత్రమే అందించేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలన్నారు. అదనపు కలెక్టర్ ఆధీనంలో జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని విద్యాసంస్థలలో ముఖ్యంగా సరుకులు బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వంట సరుకులు అన్ని నాణ్యమైనవి తీసుకోవాలన్నారు. ప్రతీ విద్యాసంస్థలో ఆహారం తయారు కాగానే చెక్ చేసి రుచి చూసేందుకు ఒక టెస్టింగ్ అధికారిని నియమించాలని తెలిపారు. విద్యాసంస్థలలో మెనూతో పాటుగా, న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, దానికై జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖ అధికారులతో కలిసి చర్చించాలన్నారు. పాఠశాలల్లో, ఇతర విద్యాసంస్థలలో పిల్లలకు అనీమియా, ఇతర వ్యాధుల బారిన పడకుండా తరచూ క్యాంప్ లు నిర్వహించి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని మందులు అందించాలని వైద్యశాల ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment