కాషాయమయం
సిద్దిపేటలో నేటి నుంచి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
● హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్, కేంద్రమంత్రి ● రేపు పట్టణంలో భారీ ర్యాలీ, సభ ● రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ● ఏర్పాట్లు పూర్తి చేసిన కార్యనిర్వాహక వర్గం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 25వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారులలో ఎక్కడ చూసినా ఏబీవీపీ జెండాలు, వాల్‌పోస్టర్‌లు, ఫ్లెక్సీ, తోరణాలతో కాషాయమయంగా మారింది. ఈ మహాసభలకు వివిధ జిల్లాల నుంచి దాదాపు 1500మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ మహాసభలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించి ప్రసంగించనున్నారు. 1949 జూలై 9న కేవలం ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 50 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో సిద్దిపేటలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. నాడు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు సిద్దిపేట వేదిక కానుంది.
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర మహాసభల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌తో పాటు, కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. 1500మంది ఏబీవీపీ నాయకులతో పాటు మరో 200 మంది ముఖ్య అతిథులకు మూడు రోజుల పాటుగా భోజనాలు, వసతి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత పరంగా పోలీస్‌లు, మున్సిపల్ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గవర్నర్ షెడ్యూల్ ఇలా..
సోమవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో భయలుదేరి 11.15 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 11.30గంటలకు ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.
ముఖ్య తీర్మానాలు ఇవే..
మహాసభల్లో ‘డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ’, ‘గ్రీన్ క్యాంపస్.. ఎకో క్యాంపస్’, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యారంగంలో నెలకొన్న శూన్యత, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై తీర్మానాలు చేయనున్నారు. అదేవిధంగా ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment